రైతులను గాలికొదిలేసి సొంత వ్యాపారాలా..?

  • బాబుకు హెరిటేజ్ పై ఉన్న ప్రేమ రైతులపై లేదు
  • రాష్ట్రంలో దీనస్థితిలో రైతన్న
  • రుణాలు మాఫీ చేయడం లేదు
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు
  • అకౌంట్లో సొమ్మున్నా తీసుకోలేని దుస్థితి
  • రైతుల ఆత్మహత్యలు బాబుకు పట్టడం లేదు
  • ప్రచార ఆర్భాటం పక్కనెట్టి..రైతు సమస్యలపై దృష్టిపెట్టు
  • బాబుకు వైయస్సార్సీపీ తూ.గో.జిల్లా అధ్యక్షుడు కన్నబాబు హితవు

హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెరిటేజ్ పై ఉన్న ప్రేమ రాష్ట్ర రైతాంగంపై లేకపోవడం బాధాకరమని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. రైతులను గాలికొదిలేసి  చంద్రబాబు తన వ్యాపారాలు చక్కబెట్టుకోవడంపై కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ గాక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, తమ అకౌంట్లలో జమ అయిన కష్టార్జితాన్ని పొందలేక రైతులు దీన స్థితిలో ఆహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు దాపురిస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడం దారుణమని అన్నారు. ఓ పక్క రబీకి రుణాలివ్వడం లేదు, మరో పక్క రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తాలుకూ సొమ్ము అకౌంట్లలో జమ అయిన తీసుకునే వెసులుబాటు కల్పించడం లేదు..?  ముఖ్యమంత్రి అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రబీ సీజన్ మరో 45 రోజుల్లో  ఎండింగ్ కు వచ్చే పరిస్థితి ఉన్నా ఇప్పటివరకు బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వకపోతే వాళ్లు వ్యవసాయం ఎలా చేసుకుంటారని నిలదీశారు.  రబీలో సుమారు రూ. 24 వేల కోట్ల రుణాలివ్వాల్సివుంటే కేవలం రూ. 3,400కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్ పుణ్యమాని రైతుకు అప్పుపుట్టని పరిస్థితి, సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. జాతీయ బ్యాంకులు కూడా రైతులకు రుణాలివ్వకపోతే పెట్టుబడి కోసం వారు ఎక్కడకు పోవాలని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. నా వల్లే నోట్ల రద్దు జరిగిందని పదే పదే చెప్పుకున్న బాబు దీనివల్ల ఏర్పడిన ఇబ్బందులపై బాధ్యతను ఎందుకు తీసుకోరని నిలదీశారు. 

 ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రూ. 6,050కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రైతుల అకౌంట్లో వేశారు.  ఇవాళ్టికి రైతులు ఒక్క రూపాయి తీసుకోని పరిస్థితి.  అది నల్లదనం కాదు, ఎవరినో ముంచేసింది కాదు...? వారి కష్టార్జితాన్ని కూడా బ్యాంకుల్లోంచి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతుంటే....కనీసం  రైతాంగానికి ఒక్కసారైనా డబ్బులు విత్ డ్రా చేసుకునే వీలువ్వాలని కేంద్రాన్ని గానీ, బ్యాంకులను గానీ ముఖ్యమంత్రి కోరకపోవడాన్ని కన్నబాబు తప్పు బట్టారు. రూ. 2,3 వేల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ పరిగాపులు పడితే వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి...? అప్పులు ఎప్పుడు తీర్చాలి..?  పండుగ ఎలా చేసుకోవాలని టీడీపీ సర్కార్ ను నిలదీశారు. ముఖ్యమంత్రి అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతుకు  అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సేపు ప్రచార ఆర్భాటంతో పరిపాలన సాగిస్తూ రైతులకు ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 2014 మే నాటికి ఎస్ ఎల్ బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రూ. 87,612కోట్ల వ్యవసాయ రుణాలివ్వాల్సి ఉంటే అవి ప్రస్తుతం రూ. లక్ష 10వేల కోట్లకు చేరింది. ఏ ఒక్క సంవత్సరం టార్గెట్ మేరకు రుణాలిచ్చింది లేదు. అంటే రైతు అంశం మీకు ప్రదానం కాదా..? ఎందుకు శ్రద్ధ చూపరు...? రూ. 5వేల  కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైంది..? ఏనాడైనా మద్దతు ధర పెంచమని కేంద్రానికి ఓ లేఖైనా రాసారా..? అని కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్వరమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 

దేశవ్యాప్తంగా ఎక్కడైనా హెరిటేజ్ కు పాలు విక్రయించాలనుకునే రైతులు వస్తే వాళ్లకు గేదెలు కొనుక్కోవడానికి రుణాలిస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఎంవోయు చేసుకున్న ముఖ్యమంత్రి...అదే మాదిరి రైతు, వ్యవసాయ కూలీలు పాడిపశువులు కొనుక్కోవడానికి బ్యాంకులతో ఎంవోయులు ఎందుకు చేసుకోవడం లేదని నిలదీశారు. హెరిటేజ్ మీద చూపించే ప్రేమ రైతులపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. చంద్రబాబు రైతు సంక్షోభాన్ని కూడా తనకు అవకాశంగా మల్చుకున్న ఘనుడని కన్నబాబు దుయ్యబట్టారు.  చంద్రన్న కానుక పేరుతో సంచిలో హెరిటేజ్ నెయ్యి..?సమ్మర్ లో రూ. 39కోట్లు కొల్లగొట్టి హెరిటేజ్ మజ్జగ పేరుతో వ్యాపారం..? డీమానిటైజేషన్ కు ముందు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మడం ఇలా ప్రతీ దాన్ని చంద్రబాబు తన వ్యాపారానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గించమని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఆక్షేపించారు. బాధ్యతరాహిత్య పనులు మాని రైతాంగం సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు. సింగపూర్, మలేషియా, జపాన్ పాట పాడిన బాబు దృష్టి  ఇప్పుడు సినిమా దర్శకులపై పడిందని ఎద్దేవా చేశారు. రాజమౌళి, బోయపాటి శ్రీను, ఇప్పుడు లేటెస్ట్ గా క్రిష్. ఏ సినిమా దర్శకుడు గుర్తొస్తే వాళ్లను పట్టుకురావడం, రాజధానికి సహాయం అడుగడమేంటో అర్థం కావడం లేదన్నారు.  గోదావరి పుష్కరాల్లో ఏమయ్యిందో గుర్తు లేదా బాబు..? ప్రజలు  రాజధానిని సినిమా సెట్టింగ్ లా ఉండాలని కోరుకోవడం లేదని..వాస్తవ దృక్పథంతో చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో  రైతుల నుంచి భూములు లాక్కోవడం, 2 తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప బాబు చేసిందేమీ లేదని కన్నబాబు విమర్శించారు. 

Back to Top