ఓటరు జాబితా తయారీలో రిగ్గింగ్

హైదరాబాద్:

సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం గవర్నరును కలిసింది. సహకార ఎన్నికల్లో అక్రమాలను వివరిస్తూ ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించింది.  సహకార సంస్థ రిజిస్ట్రారుతో మాట్లాడి ఈ అంశంపై తక్షణమే విచారణ చేయిస్తానని గవర్నరు హామీ ఇచ్చారు. గవర్నరును కలిసిన ఎమ్మెల్యేలలో బాలినేని శ్రీనివాసరెడ్డి, గుర్నాధరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుచరిత ఉన్నారు.

ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందుకే అడ్డదారులు


     సహకార ఎన్నికల్లో ఏదో విధంగా గెలిచి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. పి.ఎ.సి.ఎస్., జిల్లా సహకార బ్యాంకులు, ఆప్కాబ్, జిల్లా సహకార వాణిజ్య సమితులలో ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ఈ యత్నాలు ప్రభుత్వానికి అసలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందా అనే సందేహాన్ని కలుగజేస్తున్నాయని పేర్కొంది. గతంలో ఎన్నికలలో రిగ్గింగుకు పాల్పడే వారనీ, ఇప్పుడు ఓటరు జాబితా స్థాయిలోనే దీనిని అమలు చేస్తున్నారని తెలిపింది. అన్ని జిల్లాల్లో ఈ తంతు నడుస్తోందని తెలిపింది. సాధారణ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల మాదిరిగా సహకార సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగం లేదని పేర్కొంది.

రెండేళ్ళుగా లేని హడావుడి ఇప్పుడెందుకు


     1964 సహకార సంస్థల చట్టం ప్రకారం, ఈ సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటుకు అనుగుణమైన అధికారం సంక్రమించబోతున్నందున.. రెండేళ్ళనుంచి సహకార ఎన్నికలకు వెనకడుగు వేస్తూ వస్తున్న ప్రభుత్వం హడావుడి పడుతోందన్నారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి సహకార సంస్థల  పాలక మండళ్ళను తొలగించారని పేర్కొంది. ప్రత్యేక అధికారులతో ఓటర్ల జాబితాలను రూపొందించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించారని వివరించింది. ఓటరు జాబితాల తయారీలో ఎటువంటి విమర్శలకు తావీయలేదంది. ప్రస్తుత ప్రభుత్వం ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని ఆరోపించింది. ఈ అంశంలో వినిపిస్తున్న విమర్శలు, అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదంది. కేంద్ర చట్టం ప్రకారం కొత్త నిబంధనలు రూపొందించాల్సింది పోయి.. సహకార  ఎన్నికల నిర్వహణను హడావుడిగా పూర్తిచేస్తోందని విమర్శించింది. ఇటువంటి అవకతవకలతో రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తోందని పేర్కొంది. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నలలో ఓటరు జాబితాలు రూపొందుతున్నాయని పేర్కొంది.


స్వామిభక్తిపరాయణులకే జాబితాలో చోటు


     రెండేళ్ళ క్రితమే ముగిసిపోయిన పాలకమండళ్ళ కాలపరిమితిని పొడిగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. స్వామిభక్తిని ప్రదర్శించేవారి పేర్లను మాత్రమే జాబితాలలో పొందుపరుస్తున్నారని ఆరోపించింది. ఓటు హక్కు నిరాకరించిన వారు చేయగలిగింది ఏమీ లేదని పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి ఆఖరు తేదీ గత డిసెంబరు 21నే ముగిసిపోయినప్పటికీ, ఇప్పటికీ ఫీజును బ్యాంకులు, తపాలా కార్యాలయాలలో కడుతున్నారని గవర్నరు దృష్టికి తెచ్చింది. 30-11-2012నాటికి 39,18,000 ఉన్న ఓటర్లు 21-12-2012 నాటికి 50,48,000లకు చేరారంది. ఒక్క డిసెంబరు 21నే పదిలక్షలమందికి పైగా ఓటర్లు నమోదయ్యారనీ, ఇదెలా సాధ్యమనీ ప్రశ్నించింది. ఇంతవరకూ ఓటరు జాబితా ప్రచురించని అంశంపై దొంగ క్షమాపణలు చెబుతూనే.. కొద్ది రోజుల్లో ఆ పని పూర్తిచేస్తానంటోందని వివరించింది. కౌలు రైతులనుకూడా ఈసారి పరిగణనలోకి తీసుకున్నందున ఓటర్లు బాగా పెరిగారని ప్రభుత్వం చెబుతోందని తెలిపింది. ఈ రకంగా చూస్తే కౌలు రైతులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఓటర్ల సంఖ్య పెరుగుదల అనంతపురం, చిత్తూరు జిల్లాల కంటె తక్కువగా ఉందనీ, దీన్నిబట్టి ప్రభుత్వం వాదన సరికాదని తేలుతోందనీ వివరించింది.

     బోగస్ ఓటర్లను జాబితాలనుంచి ఏరివేసి.. నిజమైన ఓటర్లను జాబితాలో చేర్చి సహకార ఎన్నికలను న్యాయబద్ధంగా నిర్వర్తించేందుకు వీలుగా గవర్నరు ఇందులో జోక్యం చేసుకోవాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఓటరు జాబితా రిగ్గింగుకు కారకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. నిజమైన ఓటర్లను జాబితాలో చేర్చకపోతే ఎన్నికలను నిర్వహించడం, ఎన్నికలలో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉండదని ఆ వినతి పత్రంలో స్పష్టంచేసింది.

Back to Top