ఆన్‌లైన్‌లోనే మేనేజిమెంట్‌ కోటా సీట్ల భర్తీ

  • ‌సింగిల‌్ విండో తరహాలో ఒకే వెబ్‌పోర్టల్‌
  • విద్యార్థుల ఎంపిక బాధ్యత యాజమాన్యాలదే
  • పరిశీలించి ఆమోదించే బాధ్యత మండలిది
  • హైదరాబాద్, 3 సెప్టెంబర్ 2012 : వృత్తివిద్యా కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై గత నాలుగు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆన్‌లైన్‌లోనే ఈ సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 66, 67 నంబర్ జీవోలను సోమవారం సాయంత్రం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం సమావేశమై చర్చించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. భేటీ అనంతరం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ మేనే‌జ్‌మెంట్ సీట్లను ఆ‌న్‌లైన్‌లోనే భర్తీ చేస్తామని తెలిపారు.

    యాజమాన్య కోటీ సీట్ల భర్తీ కోసం ఇటీవల విడుదల చేసిన నం. 60, 61 జీవోల వల్ల బీ-కేటగిరీ సీట్ల భర్తీ పారదర్శకంగా జరిగేలా లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో ప్రభుత్వం వాటిని పునఃసమీక్షించింది. ప్రతిభ, పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు దోపిడీ రహిత విధానాలు పాటించాలని సుప్రీంకోర్టు, అర్హులైన అధికారులు భర్తీ ప్రక్రియను పరిశీలించవచ్చని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల మేరకు ప్రభుత్వం సోమవారం నం. 66, 67 జీవోలు విడుదల చేసింది. దీంతో యాజమాన్య కోటా భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగనుంది. తద్వారా మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేందుకు, ఆ దరఖాస్తుల నుంచే ప్రతిభ ఆధారిత జాబితా ఎంపికయ్యేందుకు, నిర్దేశిత ఫీజు మాత్రమే చెల్లించేందుకు అవకాశం ఏర్పడింది.

    అయితే బోధన రుసుం కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించే ఏర్పాటు చేయాల్సి ఉండగా.. దీనిని జీవోల్లో ప్రస్తావించలేదు. ప్రతిభ ఆధారిత ఎంపిక జాబితాను కళాశాలల యాజమాన్యాలే చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూనే.. ఈ ప్రక్రియ పరిశీలన అధికారం, అడ్మిషన్ల ఆమోదం బాధ్యతను ఉన్నత విద్యామండలికే కల్పిస్తూ జీవో జారీచేసింది. ఇదిలా వుండగా ఈ జీవోలను సవాల్‌ చేస్తూ కళాశాలల యాజమాన్యాలు మంగళవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

    సీట్ల భర్తీ ఇలా...
    - అర్హత ఉన్న అధికార యంత్రాంగం (ఉన్నత విద్యామండలి) బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల‌్ విండో తరహాలో ఒక వె‌బ్ పోర్ట‌ల్‌ను తయారు చేస్తుంది.
    - కళాశాలలు ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి.
    - ఈ సీట్ల భర్తీకి కాలవ్యవధిని ఉన్నత విద్యామండలి నిర్దేశిస్తుంది. పదిహేను రోజులు లేదా నెల రోజుల గడువు ఇస్తుంది. ఈ లోపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కళాశాలలు ప్రకటనలు జారీచేయాలి.
    - ఆ వెంటనే విద్యార్థులు ఈ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కళాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల విద్యార్థి ప్రతి కళాశాలకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. దరఖాస్తును నిరాకరించడానికి వీలుండదు.
    - ఒక కళాశాలలో విభిన్న కోర్సులను ఎంచుకున్నప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కళాశాలకు ఒక దరఖాస్తు సరిపోతుంది. అలాగే విద్యార్థి ఎన్ని కళాశాలలకు కావాలంటే అన్ని కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా కళాశాలలు నిర్ధారించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి వెలువరించాల్సి ఉంది.
    - విద్యార్థులు దరఖాస్తు చేసుకోగానే.. కళాశాలలు ప్రతిభ ఆధారంగా జాబితా తయారు చేయాల్సి ఉంటుంది.
    - 5 శాతం ఎన్నారై కోటా భర్తీ అయ్యాక, యాజమాన్య కోటా భర్తీలో ముందుగా ఏఐఈఈఈ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇస్తారు. వీరు లేనిపక్షంలో ఎంసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇస్తారు. వీరూ లేకపోతే ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రతిభాక్రమంలో ఎంపిక‌చేస్తారు.
    - ఈ ప్రతిభాక్రమం సరైనదేనని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదిస్తుంది. లేదంటే తిరస్కరిస్తుంది. ఆ వెంటనే కళాశాలలు ఎంపికైన విద్యార్థుల జాబితాను అదే పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతాయి.
    - ఇంకా సీట్లు మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచే రెండో మెరిట్‌ జాబితాను తయారు చేస్తారు.
    - కళాశాలలు, విద్యార్థుల వినతులు, సమస్యలు పరిష్కరించడానికి ఉన్నత విద్యామండలి ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలి.
    - ఉన్నత విద్యామండలి ఈ దరఖాస్తు విధానంపై మార్గదర్శకాలు జారీచేయాలి.
    - యాజమాన్యాలు ఎవరైనా బీ-కేటగిరీలో నిర్దేశిత ఫీజును కాదని ఎక్కువగా వసూలు చేస్తే ఏపీ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిష‌న్స్‌ అండ్ ప్రొహిబిషన్‌ ఆఫ్ క్యాపిటేషన్ ఫీజు) ‌యాక్ట్, 1983 కింద చట్టరీత్యా శిక్షార్హులు.
    - ఎంపిక జాబితాపై ఫిర్యాదు ఉంటే అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ‌ (ఏఎఫ్ఆర్సీ)కి ఫిర్యాదు చేయవచ్చు.

    సుప్రీంకోర్టు తీర్పు ఇలా‌ ఉంది..

    పి.ఎ.ఇనాందార్ అం‌డ్ అద‌ర్స్ వర్సె‌స్ మహారాష్ట్ర ప్రభుత్వం (అప్పీ‌ల్‌ (సివిల్) నంబర్ 5041/2005) కేసులో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కళాశాలల్లో యాజమాన్య కోటా భర్తీపై సమగ్ర తీర్పును వెలువరించింది. ప్రతిభ, పారదర్శకత, దోపిడీ రహిత విధానంలో ఈ సీట్ల భర్తీ జరగాలని ఆ తీర్పు స్పష్టం చేసింది. ‘మైనారిటీ, నా‌న్‌ మైనారిటీ అన్ ఎయిడె‌డ్‌ వృత్తివిద్యా కళాశాలలు క్యాపిటేషన్‌ (డొనేషన్‌) రూపంలో ఫీజులు వసూలు చేయకూడదు. లాభాపేక్ష ఉండకూడదు. లాభార్జన దృష్టితో సీట్లు భర్తీ చేయరాదు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలంటే నియంత్రణను అంగీకరించకతప్పదు. ఇది కూడా అడ్మిషన్ల ప్రారంభంలోనే చేయాలి. లేదంటే చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు. ప్రతిభ గల విద్యార్థులకు ప్రవేశం దొరకదు. యాజమాన్యాలు వారికి ఉండే హక్కులను ప్రతిభ, పారదర్శకత, దోపిడీ రహిత విధానాలకు లోబడి కాపాడుకోవచ్చు...’ అని స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రభుత్వం జీవోలో ప్రస్తావించింది.

    హైకోర్టు తీర్పు ఇది...

    2007లో తమకు కొన్ని కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తులే ఇవ్వడం లేదంటూ ఎం.రతన్, ఇతరులు రి‌ట్ పిటిష‌న్ నంబ‌ర్ 16209/2007 ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు ‘బీ-కేటగిరీ సీట్ల జాబితాకు కాంపిటేటి‌వ్ అథారిటీ అనుమతి ఇవ్వాలి..’ అని ఆదేశించింది. అలాగే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియను కాంపిటేటి‌వ్ అథారిటీ పరిశీలించవచ్చని పేర్కొంది. ఈ తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోలో ప్రస్తావించింది.

Back to Top