బన్సల్‌కో న్యాయం జగన్‌కో న్యాయమా!

హైదరాబాద్ 05 జూలై 2013:

కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ పేరును సీబీఐ చార్జి షీటులో చేర్చకపోవడం పట్ల వైయస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ అంశంపై శుక్రవారం ఆయనో ప్రకటన విడుదల చేశారు. బన్సల్ పేరును చార్జి షీటులో చేర్చకపోవడానికి సీబీఐ చెప్పిన కారణాన్ని ఎద్దేవా చేశారు. బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వేలో కీలక ఉద్యోగాల కోసం లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం, బన్సలే ఆయనను ఈ పనికి వినియోగించారని ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేసులో బన్సలును నిందితుడిగా కాకుండా 39వ సాక్షిగా చేర్చారనీ, దీనికి కారణం వారిరువురి నడుమా టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు ఎలాంటి ఆధారమూ లేదనీ సీబీఐ పేర్కొనడాన్ని అంబటి హేళన చేశారు.

ఇదే సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారిని అరెస్టు చేసి పదమూడు నెలలైందనీ, ఆయన కూడా ఏనాడూ ఏ మంత్రితోనూ, ఏ ఐఏఎస్ అధికారితోనూ ఫోన్ చేసి మాట్లాడింది లేదనీ, ఏనాడూ సచివాలయానికీ వెళ్ళలేదని తెలిపారు. ఏ మంత్రి కూడా తమను శ్రీ జగన్మోహన్ రెడ్డి ఫలానా జీవో మీద సంతకం చేయాల్సిందిగా చెప్పలేదనీ, అసలు ఆయన పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ కూడా లేవన్నారు. పెట్టుబడులు తప్పని చెప్పడానికి రాజకీయ కారణాలు తప్ప మరేవీ లేవన్నారు.

బన్సల్‌ను సాక్షిగా మాత్రమే చేర్చి, జగన్మోహన్ రెడ్డిగారిని ఎందుకు అరెస్టు చేశారు.. ప్రతి చార్జిషీటులోనూ నిందితుడిగా ఎందుకు చేర్చారు అని అంబటి నిలదీశారు. మన దేశంలో ఒకే చట్టం ఉంటే రెండు రకాల దర్యాప్తులూ, విచారణలూ ఎలా సాధ్యమవుతున్నాయని ప్రశ్నించారు. కేసు చేపట్టిన వెంటనే ఏ ఆధారాలున్నాయని దేశంలోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక సంస్థలపై సీబీఐ దాడులు చేసిందని నిలదీశారు.

రైల్వే మంత్రిగా పనిచేసిన బన్సల్ మీద ఎందుకు విచారణ జరగలేదని అంబటి ప్రభుత్వాన్ని అడిగారు. ఎవరు ఏ ప్రతిపత్తితో చెపితే సీబీఐ నడుస్తోందో తేలాలన్నారు. రైల్వే పోస్టింగుల కుంభకోణం బయటపడిన వారాల్లోనే విచారణ ఎలా పూర్తయ్యిందన్నారు. ఒకే చార్జి షీటు ఎలా వేశారు. సీబీఐ పంజరంలో చిలక మాత్రమేనని ఈ ఉదంతం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. ఏ నేరమూ చేయని శ్రీ జగన్మోహన్ రెడ్డిని 13నెలలకు పైగా నిర్బంధలో ఉంచిన అంశంమీద విచారణ చేపట్టాలని అంబటి డిమాండు చేశారు.

Back to Top