ఏకాభిప్రాయం.. పలాయన మంత్రం

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకెదురైన సమస్య నుంచి తప్పించుకోవడానికి(పారిపోవడానికి) పఠించే మంత్రం ఏకాభిప్రాయం... ఈ పదంతో ఎన్నో ఇక్కట్లను సునాయాసంగా అధిగమించేసింది. ఇప్పుడు తెలంగాణ అంశంపైనా అదే పనిలో ఉంది.  అందుకు కొంచెం భిన్నంగా అంటే 'లోతైన పరిశీలన అవసరం' అనే రాగాన్ని కొత్తగా అందుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్రం సంగతి తేల్చుకొస్తానంటూ హస్తిన చేరారు. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగానే.. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ ప్రకటన చేసేశారు. 'చిన్న రాష్ట్రాల వల్లే మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోతోందనీ, ఈ క్రమంలో తెలంగాణ అంశంపై లోతైన పరిశీలన చేయాల్సి ఉందనీ' ఆ ప్రకటన సారాంశం.
దీని పర్యవసానంగా తెలంగాణ ఏర్పాటు అంశం మళ్ళీ మొదటికొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే, మావోయిస్టుల వ్యవహారం కూడా తిరిగి తెరపైకొచ్చింది. ఇప్పట్లో దీనిని పరిష్కరించడం కష్టమనే వాదన కూడా వినిపిస్తోంది.  ఛత్తీస్‌గఢ్‌ లాంటి చిన్న రాష్ట్రాలు ఏర్పాటయ్యాక నక్సలైట్ల ప్రభావం ఎక్కువైందనీ,  ఈ కారణంగానే  తెలంగాణపై మరింత లోతైన పరిశీలన చేయాల్సి వుందని షిండే అభిప్రాయపడ్డారు.  నేడో రేపో తెలంగాణపై ఏదో ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అటు సమైక్యవాదులు, ఇటు తెలంగాణవాదులు ఎదురు చూస్తున్న సమయంలో షిండే వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.  కేంద్ర హొం మంత్రే స్వయంగా ఈ ప్రకటన చేయడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలదని అర్ధమవుతోంది.  కేంద్ర హొం మంత్రిత్వశాఖ నెలవారీ నివేదికను మీడియాకు విడుదల చేస్తున్న సందర్భంగా షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. ఫలానా తేదీలోగో తేల్చేస్తామని కేసిఆర్‌కు తామెప్పుడూ చెప్పలేదనీ, ఎవరినడిగి ఆయన అలా చెబుతున్నారో తమకు తెలియదనీ ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం ఇప్పుడిప్పుడే వుండే అవకాశం లేదని అంటూనే షిండే నక్సలైట్ల సమస్యను ప్రస్తావించడం టిఆర్‌ఎస్‌ నేతలకు కోపాన్ని తెప్పిస్తోంది. ఇదే నేపథ్యంలో కేసీఆర్ వయలార్ రవిని కలిసి ఈ వ్యాఖ్యలపై అసహానాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది.  
సీమాంధ్రుల సమైక్య రాగం
మరోవంక సీమాంధ్ర ఎంపీలు ఎప్పటికప్పుడు ఢిల్లీలో సమావేశమవుతూ సమైక్యరాగాలు ఆలపిస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోదనీ, తెలంగాణ సమస్య వల్ల ఇప్పటికే అభివృద్ధి ఆగిపోయిందనీ ప్రకటనలు చేస్తూ తెలంగాణవాదులకు కౌంటర్‌ ఇవ్వడం సర్వసాధారణ విషయమైంది. ఈ నేపధ్యంలోనే  టిడిపి కూడా తెలంగాణపై లేఖ  ఇవ్వడానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.  టిడిపి లేఖ ఇస్తే అప్పుడు ప్రజలే కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తారనీ, ఇక నాన్చడం ఎంతమాత్రం కుదిరే వ్యవహారం కాదన్నది తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అభిప్రాయం. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌ తీవ్రంగా దెబ్బతింటుందని గులామ్నబీ ఆజాద్‌కు తెగేసి చెప్పినట్లు యాష్కీ తెలిపారు.
మధు యాష్కి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
షిండే వ్యాఖ్యలతో ప్రత్యేక రాష్ట్ర నినాదం వేడెక్కింది. మధుయాష్కీ మళ్లీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. సీమాంధ్రుల అక్రమ ఆస్తులపై దాడులు చేస్తేగానీ ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. సీమాంధ్ర ఎంపీలు అడ్డుపడుతున్నారని పునరుద్ఘాటించారు. బిజెపి, సిపిఐ, కాంగ్రెస్, టిడిపి తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.  ఈ నెలలో ప్రకటన వెలువడితే సంబరం.. లేకపోతే సమరమేనని టీఆర్ఎస్ నేత కె. తారక రామారావు హెచ్చరించారు. మరో పక్క తెలంగాణ రాజకీయ జేఏసీ తెలంగాణ మార్చ్‌కు సిద్ధమవుతోంది. నెలాఖరులోగా రాష్ట్ర విభజన ప్రకటన చేస్తే సరి, లేదంటే తెలంగాణ మిలియన్ మార్చ్‌తో తమ తడాఖా చూపిస్తామని కెసిఆర్ హెచ్చరించారు.

Back to Top