'నిబంధనల ప్రకారమే జగన్ ములాఖ‌త్‌లు'

హైదరాబాద్ : చట్టం, న్యాయ నిబంధనలు, జైలు మాన్యువల్ ప్రకారమే వైయస్‌ఆర్ ‌కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ములాఖత్‌లలో రాజకీయ నాయకులను కలుసుకుంటున్నారని, ఈ విషయం సాక్షాత్తూ జైళ్ల శాఖ డి.జి. కృష్ణరాజు చెప్పారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వివరించారు. హైదరాబాద్‌లో ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ జగన్ ములాఖ‌త్‌లు జరుగుతున్నాయంటూ టిడిపి‌, కాంగ్రెస్‌ నాయకులు యనమల రామకృష్ణుడు, వి. హనుమంతరావు, గండ్ర వెంకట రమణారెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు.

ములాఖత్‌లపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని, చంచల్‌గూడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కనుక అక్కడ ములాఖత్‌లు సక్రమంగా జరుగుతున్నాయో, లేదో ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌ రెడ్డి స్పష్టంగా ప్రకటన చేయాలన్నారు. ఆ బాధ్యత సిఎంపై ఉందని అంబటి స్పష్టంచేశారు. పది నెలలుగా జైల్లో పెట్టినా శ్రీ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గించలేకపోయామే అన్న కడుపుమంటతో, ద్వేషంతోనే టిబిపి, కాంగ్రెస్ ‌నాయకులు అనవసరమైన యాగీ చేస్తున్నారు తప్ప కొంచెమైనా వారి మాటల్లో నిజం లేదని అంబటి ఖండించారు.
Back to Top