రైతు ఆత్మహత్యలపై నిమిషాల్లో మాట మార్చిన చంద్రబాబు

వెలగపూడి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే లేవని చెప్పిన ప్రభుత్వం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైక్‌ అందుకోగానే చంద్రబాబు ఆత్మహత్యలున్నాయంటూ నిమిషాల్లోనే మాట మార్చాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై నిండు సభలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ఆత్మహత్య చేసుకున్న ప్రతీరైతు కుటుంబం దగ్గరికి వెళ్తా వారిని పరామర్శిస్తానని చెప్పగానే ఆత్మహత్యలు ఉన్నాయంటూ బాబు తప్పును ఒప్పుకున్నాడని చెప్పారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నామని ప్రత్యేక జీవో విడుదల చేసిన ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైందన్నారు. కేవలం రూ. 130 మందికి రూ. 1.5 లక్షలు ఇచ్చిందని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ వేసి ఆ కమిటీ గుర్తించిన వారికే ఇస్తామని గుడ్డిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వైయస్‌ జగన్‌ రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ బాధిత ఇండ్లకు వెళ్లారు కాబట్టే ఆ మాత్రం పరిహారం అయినా దక్కిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఆత్మహత్యలకు గల కారణాలు చెప్పారు కానీ ఎందుకు వాటిని అరికట్టలేకపోతున్నారో చెప్పలేదని మండిపడ్డారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు జోక్యం చేసుకొని రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని సూచించినా,, ప్రభుతానికి నోటీసులు జారీ చేసిందన్నారు. రైతుల ఆత్మహత్యలను గుర్తిస్తే ప్రభుత్వ ప్రతిష్ట ఎక్కడ మంటగలిసిపోతుందోనని గుర్తించడం లేదన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు పెన్షన్లు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
చిత్తశుద్ధితో రైతులను ఆదుకున్న ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌
దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆత్మహత్యలు ఎక్కవగా జరిగాయని చంద్రబాబు సర్కార్‌ తప్పుడు లెక్కలు చెబుతోందని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధితో అసలు ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి నిజాయితీగా జైతీగోస్‌ కమిషన్‌ వేసి జేఎన్‌యూ ప్రొఫెసర్‌ను చైర్మన్‌గా పెట్టి విచారణ చేయించారని సూచించారు. చంద్రబాబు కాలం నుంచి జరిగిన ఆత్మహత్యలకు కూడా పరిహారం ఇస్తామని అంగీకరించిన ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యలపై జస్టిస్‌ పీఏ చౌదరి అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా జిల్లాల వ్యాప్తంగా విచారించారని చెప్పారు. ఆ  రిపోర్టును బాబుకు అందించడానికి వెళితే కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యలపై «కమిటీ వేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వక్రవాదనకు నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశామని స్పష్టం చేశారు. 

Back to Top