నగదు పథకం పేరిట ముంచేశారు

కర్నూలు:

అధికార పార్టీ అండతో మనీ స్కీం పెట్టి నాలుగు జిల్లాల్లో వేలాదిమందిని ముంచేశారని బాధితులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిలకు ఫిర్యాదు చేశారు. తాళిబొట్లు, కమ్మలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు కట్టి మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారూ ఉన్నారని వివరించారు. నిందితులకు కాంగ్రెస్ ఎంపీ మద్దతు ఉందని వారు ఆరోపించారు. హోంమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి నిందితులను అరెస్టు చేసేవరకూ పోరాడతామని షర్మిల వారిని హామీ ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పటైన సభలో ఈ విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. 23 రోజులలో ఆమె మొత్తం 297 కిలోమీటర్లు నడిచారు.

గోడెవరికి చెప్పుకోవాలి
   

     ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే చూసిన ఆమె.. అధికార పార్టీ ఎంపీ మద్దతుతో ఆ పార్టీకే చెందిన ఓ వ్యక్తి రూ.100 కోట్ల మేర కర్నూలు సహా నాలుగు జిల్లాల ప్రజల్ని ముంచేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో అధికార పార్టీకి చెందిన రంగస్వామి అనే వ్యక్తి తమను మోసం చేశాడని, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని, అతడికి ఓ కాంగ్రెస్ ఎంపీ మద్దతు ఉండడంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లాలో 23వ రోజు శుక్రవారం షర్మిల పాదయాత్ర సాగిన దారి పొడవునా రైతులు, వ్యవసాయ కూలీలు ప్రధానంగా ఇదే అంశంపై షర్మిలకు ఫిర్యాదుచేశారు. రంగస్వామి ‘శ్రీ నంది యువజన సమాఖ్య’ పేరుతో సంస్థ ప్రారంభించాడని, తాను ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నానంటూ తమను నమ్మించాడని తెలిపారు. రూ.700 కడితే 10 నెలల పాటు ప్రతి నెలా రూ. 300 చొప్పున చెల్లిస్తామని చెప్పాడని, రూ. 700కు రూ. 3 వేలు వస్తున్నాయని ఆశపడి తాళిబొట్లు, చెవి కమ్మలతో సహా తాకట్టు పెట్టి ఈ స్కీమ్‌లో పెట్టామని పలువురు మహిళలు వాపోయారు. కొద్దిరోజులు డబ్బులు ఇచ్చి అందరినీ నమ్మించి బిచాణా ఎత్తేశాడన్నారు. సుమారు రూ.100 కోట్ల దాకా మోసం జరిగి ఉండొచ్చని పలువురు తెలిపారు. తమకు న్యాయం చేయాలని షర్మిలను కోరారు.

అవసరమైతే ఎంపీనీ అరెస్టు చేయాలి: షర్మిల

     ఉదయం గం.10.40కు పత్తికొండ నియోజకవర్గ పరధిలోని అగ్రహారంలో రచ్చబండ వద్ద షర్మిల ప్రజలతో ముచ్చటించినపుడు వారు ఈ మనీ సర్క్యు లేషన్ స్కీమ్ గురించి చెప్పారు. అది మొదలు యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు ఇదే అంశాన్ని ఆమెకు మొరపెట్టుకున్నారు. న్యాయం చేస్తామన్న డోన్ డీఎస్పీ రెండు నెలలైనా తమ ముఖం చూడలేదని చెప్పుకొచ్చారు. నిందితులకు ఎవరి మద్దతు ఉందని షర్మిల ఆరాతీయగా.. ‘కాంగ్రెస్ ఎంపీ అని చెబుతున్నారు. స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ వ్యక్తి రంగస్వామి. మాకైతే ఏజెంట్లే దిక్కు. దాదాపు 2 వేల మంది ఏజెంట్లు ఆయన కింద పనిచేశారు’ అని ఒకరు చెప్పారు.

హోంమంత్రి దృష్టికి తీసుకెడతాం: షర్మిల


      మరో వ్యక్తి మాట్లాడుతూ మల్లికార్జున్ అనే యువకుడు రూ.5 లక్షలు అప్పుతెచ్చి బాండ్లు కొన్నాడు. మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మేమే రూ. 12 వేలు ఖర్చుపెట్టి బతికించుకున్నాం..’ అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘మనీ స్కీమ్‌లో వందల కోట్లు మోసపోయారని చెబుతున్నారు. మోసం చేసిన వాళ్లకు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని చెబుతున్నారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు. అవసరమైతే ఆ ఎంపీని కూడా అరెస్టు చేయాలి. ప్రభుత్వం తక్షణం కళ్లు తెరవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వీళ్ల బతుకుల మీద, కడుపుల మీద దెబ్బ కొట్టొద్దు..’ అని పేర్కొన్నారు. ‘మా పార్టీ తరఫున హోంమంత్రిని క లిసి ఈ సమస్యపై విన్నవిస్తాం. తక్షణం సమస్య పరిష్కారమయ్యే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ మీకు అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు.


జనం.. జనం.. జనం..     శుక్రవారం పాదయాత్ర మద్దికెర నుంచి తుగ్గలి వరకు 15.5 కిలోమీటర్ల మేర సాగింది. అడుగడుగునా జనప్రవాహం ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికింది. సాయంత్రం 6.50కి తుగ్గలి చేరుకున్న షర్మిల అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. సభ అనంతరం రాత్రి 7.20కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బస వద్ద షర్మిలను కలిశారు. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 296.80 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top