నాయుడు-కాంగ్రెస్ కుమ్మక్కు బహిర్గతం: విజయమ్మ

హైదరాబాద్, 15 మార్చి 2013:

ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైయస్ఆర్ సీఎల్పీ నాయకురాలు అయిన శ్రీమతి వైయస్ విజయమ్మ తీవ్రంగా తప్పుబట్టారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చేపట్టిన చర్చలో ఆమె పాల్గొన్నారు.

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓ ప్రతిపక్ష నేత నిరాకరించడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటి సారని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రస్తుత వైఖరి అధికార కాంగ్రెస్ పార్టీతో ఉన్న లోపాయకారీ ఒప్పందాన్ని వెల్లడిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రం రెండు ఉత్పాతాలను ఎదుర్కొంటోందన్నారు. అందులో ఒకటి ప్రాకృతికమైనదైతే.. రెండోది ప్రభుత్వం సృష్టిస్తున్నదని ఆమె వివరించారు. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయనీ, కానీ సరఫరా అత్యంత దయనీయంగా ఉందనీ చెప్పారు. ఇదేం విధానమని శ్రీమతి విజయమ్మ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. ఎక్కడైనా ఎక్కువ వసూలు చేసేది చక్కటి సౌకర్యాలు కల్పించడానికి, రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రతి రంగమూ సెలవు ప్రకటించాల్సిన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

రాష్ట్రం ప్రస్తుతం ఊహించలేనంత కరెంటు సంక్షోభంలో కూరుకుపోయిందనీ, గత యాబై సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోవడమే దీనికి కారణమని ఆమె విశ్లేషించారు. కరెంటు ఉత్పత్తి చేసేందుకు బొగ్గు గానీ, గ్యాస్ గానీ అందుబాటులో లేవని ప్రభుత్వం తప్పించుకోజూస్తోంది తప్పితే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎటువంటి చర్యలూ చేపట్టలేదని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. విద్యుత్తు రంగంపై కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు.

నీలం బాధితులకు ఏం చేశారు?
రాష్ట్రంలో అన్నదాత నిస్సహాయ స్థితిపై శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. నీలం తుపాను సమయంలో నష్టపోయిన రైతులకు, ఇతరులకు చేసిన ఆర్థిక సహాయ వివరాలను వెల్లడించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ మృతి తర్వాత రైతాంగం చెప్పుకోలేని ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని ఆమె చెప్పారు. కొత్త పరిశ్రమల ఊసే లేకుండా పోయిందన్నారు. రైతులను దయనీయ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం గడిచిన నాలుగేళ్ళలో ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను గట్టెక్కించడానికి మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రుణాలను మాఫీ చేసిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేకపోయిందన్నారు.

Back to Top