రాజకీయ ఒత్తిళ్లతో లగడపాటి కాకిలెక్కలు

హైదరాబాద్:

రాజకీయాల్లో తాను లేనని చెబుతూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విమర్శించింది. ‌టీడీపీ పార్టీ ఒత్తిళ్లకు లొంగిపోయో, లేక వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే పేరుతో అసత్య ప్రకటనలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుఉడు డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితం పేరుతో ఆయన కాకిలెక్కలు చెప్పారని నిప్పులు చెరిగారు.‌ పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా ‌టీడీపీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని‌ ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30వ తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు.

‌సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం లగడపాటికి కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల  సందర్భంగా వైయస్ఆర్‌సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోయిందని గుర్తుచేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎ‌స్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.

Back to Top