కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలి

  • పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్ఆర్
  • ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచిన సర్కార్
  • ఆరోగ్యశ్రీ అమలుపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా కామినేని..?
  • ధర్నాకు తరలుదాం..ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపు
గుంటూరు: ఆరోగ్యశ్రీ అమలు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంతో వైయస్‌ఆర్‌ పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. అలాంటి బృహత్తరమైన పథకాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇప్పటి సీఎం చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పేరు మార్చారని, అంతేకాకుండా ఈ పథకంలో కమీషన్లు రావని గ్రహించిన చంద్రబాబు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించారని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తీరు బాధాకరమన్నారు. ఆయనకు దమ్మూ,ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ అమలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ నెల 9న ఒంగోలులో జరిగే ధర్నాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని, పార్టీ శ్రేణులు, ఆరోగ్యశ్రీ బాధితులు నిరసనలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
 
Back to Top