ముస్లిం యువ‌కుల‌ అరెస్టు అప్రజాస్వామికం

గుంటూరు: తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. వారు  గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమ సమస్యలపై నిరసనలు తెలియజేశారని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వాలు వారిని అరెస్టులు చేయలేదని గుర్తు చేశారు. నేడు టీడీపీ ప్రభుత్వం ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. సీఎం సభలో మైనార్టీ మంత్రిని ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తే చివరికి మొండి చెయ్యి ఎదురైందని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. ముస్లిం యువకులను అరెస్టు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇలాంటి అణచివేత చర్యలను మానుకోకపోతే ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. 
Back to Top