మోపిదేవిని బలిపశువును చేశారు: విజయమ్మ

హైదరాబాద్ 05 జూలై 2013:

దివంగత మహానేత తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకట రమణను బలిపశువును చేశారని  పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆరోపించారు. 26 జీవోల కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆమె స్పష్ఠంచేశారు. మాజీ మంత్రి మోపిదేవి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం లోటస్ పాండ్‌లోని కార్యాలయంలో శ్రీమతి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో, శ్రీ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. మోపిదేవిని అరెస్టు చేసే ముందు ....వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. 26 జీవోల కేసులో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాక్టర్ వైయస్ఆర్ రెక్కల కష్టంతో  రాష్ట్రంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకు ప్రతిఫలంగా డాక్టర్ వైయస్ఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిపి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె  చెప్పారు. ప్రతి పంచాయతీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవి ముఖ్య అనుచరులు సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Back to Top