'మోకాలిపై ఒత్తిడి పడనివ్వ వద్దు'

సత్తెనపల్లి (గుంటూరు జిల్లా) : అసమర్థ కాంగ్రెస్‌ పాలనకు, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా అలుపెరుగకుండా పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలకు మోకాలి నొప్పి మళ్లీ తీవ్రమైంది. ఆ నొప్పిని భరిస్తూనే ఆమె ఆదివారం తన పాదయాత్ర కొనసాగించారు. అయితే, కొంతకాలం పాటు కుడికాలిపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని శ్రీమతి షర్మిలకు శస్త్ర చికిత్స నిర్వహించిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. నొప్పి తగ్గేంత వరకు ఎక్కువ దూరం నడవటం మంచిది కాదని, దూరాన్ని తగ్గించి, మెల్లగా నడవాలని శ్రీమతి షర్మిలకు ఆయన సలహా ఇచ్చారు.

అంతకు ముందు శనివారం రాత్రి కరచాలనం చేయాలన్న హుషారులో ఓ అభిమాని శ్రీమతి షర్మిల కాళ్లకు అడ్డుపడ్డాడు. ఆ హఠాత్సంఘటనతో ఆతనిని తప్పించే ప్రయత్నంలో శ్రీమతి షర్మిల కాలు కొద్దిగా మెలిపడినట్లయింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న శ్రీమతి షర్మిలకు ఆదివారం ఉదయం ఆర్థోపెడిక్ సర్జ‌న్ డాక్ట‌ర్ చంద్రశేఖ‌ర్‌రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ హరికృష్ణతో కలిసి‌ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.

శ్రీమతి షర్మిల నడిచే సమయంలో పాదం అపసవ్య దిశలో పడటంతోనే సమస్య ఏర్పడిందని డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. గతంలో కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేసిన భాగం వద్ద నొప్పి వచ్చిందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు పాదయాత్ర సమన్వయ కర్త తలశిల రఘురాం పార్టీ నాయకులతో చర్చించి ఆదివారం యాత్రను 5 కిలోమీటర్లకు కుదించారు.
Back to Top