ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

  • సంతలో గొర్రెలను కొన్నట్టు ఓటర్లను కొంటున్న టీడీపీ
  • గంటకుపైగా క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్‌ జగన్‌
  • అర్హత లేకున్నా పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీ
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు సంతలో గొర్రెలను కొన్నట్లుగా ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా నిర్వహిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కొరుముట్ల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు గంటసేపు క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అనే ఒక బలమైన సందేశాన్ని వైయస్‌ జగన్‌ ప్రజల్లోకి పంపించారన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం క్యూ లైన్‌లో నిల్చోకుండా సపరేట్‌గా పోలింగ్‌ కేంద్రానికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కులేని వాళ్లను కూడా పోలింగ్‌ కేంద్రానికి పంపుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి ఓ రూల్, వైయస్‌ఆర్‌ సీపీకి ఒక రూల్‌ ఏంటని ప్రశ్నించారు. న్యాయపరంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న టీడీపీ
వైయస్‌ఆర్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ వేసే అర్హత టీడీపీకి లేకున్నా పోటీకి దిగిందని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. జిల్లాలో 840 స్థానాలుంటే వాటిలో దాదాపు 550 సీట్లు వైయస్‌ఆర్‌ సీపీవేనని స్పష్టం చేశారు. అర్హత లేకున్నా పోటీకి దిగి ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధంగా బెదిరింపు ఎన్నికలు జరిపిస్తున్నారని మండిపడ్డారు. ఓటు హక్కులేని వ్యక్తులను పోలింగ్‌ కేంద్రాలకు ఎందుకు పంపించారని అధికారులను ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించాలని కోరినా.. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. డబ్బులు ఎరజూపి ఓటర్లను దండుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కార్‌ ఎన్నికల్లో ఎన్ని కుట్రలకు పాల్పడినా వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని స్పష్టం చేశారు. 

Back to Top