కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే రాజీనామాలు

హైదరాబాద్ 26 జూలై 2013:

రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత హోదాలో తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారని పార్టీ  నేత నల్లా సూర్యప్రకాశరావు  స్పష్టంచేశారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదనీ, అలాగే ఎమ్మెల్యేల రాజీనామాలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనీ ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.

పార్టీ మొదటి ప్లీనరీలో తెలంగాణ అంశంపై వ్యక్తపరిచిన అభిప్రాయానికే కట్టుబడి ఉందన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తమ ఎమ్మెల్యేలు నిరసిస్తున్నారని తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే ముందు కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించి తీరాలని వారు డిమాండ్ చేస్తున్నారని వివరించారు.
న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తెలంగాణ అంశంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తొలుత తన వైఖరిని వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ మిగిలిన వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పారు.
తెలంగాణ అంశం, హైదరాబాద్ పరిస్థితిపై వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని సూర్యప్రకాశ్ మండిపడ్డారు. ఒకపక్కన రాయలసీమలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, మరోవంక సీమాంధ్ర మంత్రులు తెలంగాణను వ్యతిరేకిస్తూ సమావేశాలు నిర్వహించడం కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమన్నారు.
తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని నాలుగేళ్ళుగా అనిశ్చితిలో ఉంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ వైఖరిని నిరసిస్తూనే అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారని వివరించారు. వారి రాజీనామాలు పూర్తిగా వ్యక్తిగతం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కానేకాదు అని స్పష్టంచేశారు. పార్టీ మొదటి ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయంపై దాడికి ఖండన: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొత్తులు కొందరు తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగడాన్ని ఆయన ఖండించారు. తమ పార్టీపై దాడి చేయించడం కంటే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఖండించి ఉండాల్సిందన్నారు.

తాజా వీడియోలు

Back to Top