ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు

తాడేపల్లి రూరల్‌: జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈవెంటు మేనేజర్లుగా వ్యవహరిస్తోంది తప్ప, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన పై విధంగా పేర్కొన్నారు. పుష్కరాలకు ముందు నుంచి మంగళగిరి నియోజకవర్గంలో డెంగీ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దుగ్గిరాల మండలానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు డెంగీతో మరణించినట్టు ఈనెల 11వ తేదీనే జిల్లా యంత్రాంగానికి, వైద్య శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పుష్కరాలలో ఇళ్లను కూల్చడం వంటి ఈవెంట్లు నిర్వహించి కాలయాపన చేశారు తప్ప ప్రజల ఆరోగ్య పరిస్థితిని మాత్రం పట్టించుకోలేదన్నారు. ఆ ఫలితమే తాడేపల్లి మునిసిపాలిటిలో ఓ చిన్నారి మృతికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top