సీట్ల కోసం రాష్ట్రాన్ని చీల్చటం దుర్మార్గం

హైదరాబాద్ :

కొన్ని ఎంపీ సీట్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఏకపక్షంగా ముక్కలు చేయడం దుర్మార్గం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు -2013 వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా, కేవలం ఓట్లు, సీట్ల కోసం సభలోకి వచ్చిన విభజన బిల్లును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని భూమన మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. విభజన బిల్లును తిరస్కరించే క్రమంలో ఆయన తన అభిప్రాయాన్ని శనివారం అసెంబ్లీలో వెల్లడించారు.

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు, పార్లమెంటులో చిదంబరం ఇచ్చిన హామీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని, దీనిపై ఓటింగ్‌ జరిగినప్పుడు ఓడిస్తామని భూమన స్పష్టం చేశారు. శనివారం ఉదయం శాసనసభ ప్రారంభమైన వెంటనే వైయస్ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియం ‌ముందుకెళ్ళారు. సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.

‘సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి దేశంలోని అనేక పార్టీల అధినేతలను కలిశారు. మా పోరాటానికి మాద్దతివ్వాలని విన్నవించారు. సమైక్య తీర్మానం చేయాలని సభా నియమావళిలోని 77, 78 నిబంధనల కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చాం. విభజనను వ్యతిరేకిస్తూ 164వ నిబంధన కింద పిటిషన్ స‌మర్పించాం. 2013 డిసెంబర్ 23, 24 తేదీల్లో రాష్ట్రపతికి అఫిడవిట్లు స‌మర్పించాం. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే సమైక్య తీర్మానం చేయాలని కూడా కోరాం’ అని భూమన గుర్తుచేశారు.

రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం నిర్ణయం తీసుకోవడం అంటే రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు కోయడం కాదని కరుణాకరరెడ్డి అన్నారు. ‘తండ్రిలా నిర్ణయుం తీసుకోమన్నాం. అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే మా అభిప్రాయం’ అని భూమన పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది వైయస్ఆర్‌సీపీ ఒక్కటే అన్నారు.

తెలంగాణ ప్రజలంటే చిన్నచూపు లేదు:
మంత్రి శైలజానాథ్ ‌మాట్లాడిన తీరు 'ఉరికంభం ఎక్కిన వ్యక్తిని ఉరి తీసే తలారే దీర్ఘాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించినట్టుగా ఉంద'ని కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ‌మాట్లాడటం దారుణం అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల తమకు ఏనాడూ తక్కువ అభిప్రాయుం లేదని భూమన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.‌ రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల అభిప్రాయాలను టీడీపీ గౌరవించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆ పార్టీ వాళ్లు ఆత్మను అమ్మకానికి పెట్టారని దుమ్మెత్తిపోశారు. 2,700 ఏళ్లుగా తెలుగువారు కలిసే ఉన్నారని తెలిపారు. సీమాంధ్రులు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు.

మహానేత వైయస్ఆర్, జగన్‌లపై అభాండాలేంటి?
రాష్ట్ర విభజన చర్చలో పాల్గొంటున్న ఇతర పార్టీల సభ్యులు దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డిపై‌న, శ్రీ వైయస్ జగ‌న్‌పై అభాండాలు వేయడం ఏమిటని భూమన ప్రశ్నించారు. హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా కావాలా అన్న వైయస్‌ఆర్‌ను విభజనవాది అని విమర్శిస్తారా అంటూ భూమన మండిపడ్డారు. తెలంగాణ కోసమే ఆయన రోశయ్యు కమిటీ వేశారనడం సరికాదన్నారు. రోశయ్యు కమిటీ వేసిన సందర్భంగా, పరిశీలించాల్సిన వివిధ అంశాలను వివరించి, దర్యాప్తు చేయాలని మాత్రమే వైయస్ఆర్ చెప్పారని గుర్తుచేశారు.‌ మహానేత వైయస్ఆర్‌ను తూలనాడుతున్నా, ఆయన ప్రాపకంతో అధికారంలో ఉన్నవారు పట్టనట్టుగా ఉండడాన్ని చూస్తే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని మరోసారి రుజువవుతోందన్నారు.

నష్టపోతామని తెలిసినా సమైక్యాంధ్రకే నిలబడిన పార్టీ:
‘ఒక ప్రాంతంలో రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా వైయస్ఆర్‌సీపీ సమైక్యాంధ్రే కావాలని కోరుతోంది. టీడీపీలో మాత్రం సగం మంది విభజన కావాలని, మిగిలిన సగం సమైక్యాంధ్ర అంటున్నారు. వారు కూడా లోపల మాత్రం విభజనే కావాలంటున్నారు’ అంటూ భూమన ఎద్దేవా చేశారు. తాము టీడీపీలాగా స్వార్థ రాజకీయం కోసం ఆలోచించలేదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన చేయగా, మీ నాయకుడు చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించండని‌ భూమన సవాల్ చేశారు.

కరుణాకరరెడ్డి ప్రసంగంలోని ప్రధానాంశాలు :

- ఇదివరకటి కొత్త రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ లేదా శాసనసభల తీర్మానాలతో ఏర్పడ్డాయి. ఈ బిల్లు అందుకు పూర్తి భిన్నం.
- జల వివాద ట్రిబ్యునళ్లున్నా సమైక్య రాష్ట్రంలో కర్నాటక, మహారాష్ట్రలతో పోరాడుతున్నాం. రాష్ట్రం విడిపోతే మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయి.
- హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే 50, 60 ఏళ్లయినా సాధ్యం కాదు. 75 % పన్నులు హైదరాబా‌ద్ నుంచే వస్తున్నాయి‌
- సీమాంధ్ర ప్రాంతాల పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల చుట్టూ తిరగాలా?
- విభజన బిల్లుపై చర్చలో పాల్గొనబోం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఓటింగ్‌లో పాల్గొంటాం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top