విజయవాడ :
అధికారపార్టీ ఎరవేసిన అవినీతి సొమ్ముకు ఆశపడి పచ్చకండువా కప్పుకున్న ఫిరాయింపుదారుడు జలీల్ ఖాన్ పై ముస్లిం సోదరులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్‌లు కూలుస్తున్నావు, జాతి జాతి అంటూ ముస్లింలను తాకట్టు పెడుతున్నావని పశ్చిమ నియోజకవర్గ ముస్లింలు జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలని జలీల్ ఖాన్ ను డిమాండ్ చేశారు.
తారాపేటలోని మసీదు, ఖబర్‌స్తాన్ కూల్చేం దుకు అధికారులు సమయుత్తమవుతున్న నేపథ్యంలో అక్కడి ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తారాపేట మసీదు ప్రాంగణం వద్ద సమావేశమయ్యారు. ముస్లిం మత ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో జలీల్‌ఖాన్ అక్కడకు రాగానే ముస్లింలు ఒక్కసారిగా రావద్దంటూ నినాదాలు చేశారు. మత పెద్దలు వారిని సముదాయించి కూర్చోపెట్టారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ తనకు పదవులు, పార్టీలు ముఖ్యం కాదని, మసీదుకు సంబంధించి ఒక్క ఇటుక తీసినా వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. దాంతో అక్కడున్న వారంతా రాజీనామా చేసేయ్ అంటూ బిగ్గరగా అరిచారు.
రామవరప్పాడు మసీదు కూల్చివేత అంశంలోనూ ముస్లింలను మభ్యపెట్టి ప్రభుత్వానికి అండగా నిలిచావంటూ జలీల్ ఖాన్ పై మండిపడ్డారు. తాను ముస్లిం పెద్దలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తానంటూ నమ్మబలికారు. అయినా ముస్లింలు ఎదురుతిరగడంతో జలీల్‌ఖాన్ బిత్తరపోయారు. సమదాయించటానికి ముస్లిం పెద్దలు కూడా ఇబ్బంది పడ్డారు.
మసీదుల జోలికి వస్తే ఊరుకోం : ఆసిఫ్
తారాపేట మసీదు జోలికి వస్తే ఊరుకోమని వైయస్సార్ సీపీ పశ్చిమ నియోయజకవర్గ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. మౌన ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాలన్నారు.