జీవోలన్నీ తప్పుల తడకలేప్రతిపక్ష నేత నిలదీస్తే తప్ప స్పందించని సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు
గుంటూరుః వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విలువల్లేవు, చట్టానికి చట్టబద్ధత లేదని నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు చట్టాన్ని చుట్టాలుగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలు సుబిక్షంగా ఉండేందుకు ఆస్కారం లేకుండా పోయిందని నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు జారీ చేసిన జీవోలన్నీ తప్పుల తడకేనని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై నిలదీస్తే తప్ప మేల్కొనకపోవడం...టీడీపీ ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. తప్పుడు జీవోలు, తప్పుడు నిర్ణయాలపై వైఎస్ జగన్ గొడవ చేస్తే తప్ప...ప్రజల సమస్యలు పట్టవా అని నాగార్జున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జీవోలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతల మీద ఎస్సీ, ఎస్టీ చట్టాలను ఉపయోగిస్తూ చంద్రబాబు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు.
రాజ్యాంగ బద్ధంగా ఆదివాసీలకు నివాసప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నా...వాటిని బేఖాతరు చేస్తూ లాభాలు గడించడం కోసం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో 97 తీసుకొచ్చారని నాగార్జున విరుచుకుపడ్డారు. ఆదివాసీలకు అండగా వైఎస్ జగన్ ...మన్యం పర్యటనకు సమాయత్తమయిన తరుణంలో ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుందన్నారు. జీవోను శాశ్వతంగా రద్దు చేసేంతవరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు.