ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

న్యూఢిల్లీ: తమ పార్టీ ద్వారా ఎన్నికైన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందున పార్టీ ఫిరాయంపుల నిరోధక చట్టం కింద తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ స్పీకర్ ను కోరింది. ఈ మేరకు పార్టీ లోక్ సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వెలగపల్లి వరప్రసాద రావు, కొత్తపల్లి గీత, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బుట్టా రేణుక గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి వినతి పత్రం అందచేశారు.

'ఎస్పీవై రెడ్డి మే 25న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు పత్రికలలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయనకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఆయనపై అనర్హత వేటు వేయగలరు' అని స్పీకర్ ను కోరారు. అనంతరం ఎంపీలతో కలిసి మేకపాటి మీడియాతో మాట్లాడారు. ' మా పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపిన ఎంపీ ఎస్పీవై రెడ్డి...ఫిరాయింపుల నిరోధక చట్టం పదో షెడ్యూలులోని క్లాజ్ -2 (1) ఏ ప్రకారం అనర్హతకు గురవుతారు. అందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాం. అందుకు సంబంధించిన సాక్ష్యాలను మేం స్పీకర్ కు అందచేశాం. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పారు' అని వెల్లడించారు.

Back to Top