ప్రభుత్వ అవినీతిని మీడియా ఎందుకు ప్రశ్నించదు

అవినీతి సొమ్ముతో బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారు
వైఎస్సార్సీపీపై తప్పుడు కథనాలు రాస్తున్న..
మీడియాపై పరువు నష్టం దావా వేస్తాం
మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి
బాబు కేంద్రంతో రాజీపడడం వల్లే బడ్జెట్ లో ఏపీకి అన్యాయం

హైదరాబాద్ః  అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నా.... మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి  నిలదీశారు. హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ సీపీ సమావేశంపై... కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు కట్టుకథలు రాశాయన్నారు. తప్పుడు కథనాలు రాసిన పత్రికలపై పరువు నష్టం దావా వేయాలని పార్టీ నిర్ణయించినట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.  తప్పుల్ని ఎత్తి చూపాల్సిన ఛానళ్లు .....తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

క్యారెక్టర్ గురించి మాట్లాడే చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి  సూటిగా ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ..వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాతీర్పును గౌరవించడమంటే ఇదేనా బాబు అని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ తమ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఒక్కటి కూడా అమలు చేయడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. 

ఎవరో కొందరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీపరంగా  తాము ఎలాంటి విశ్వాసం కోల్పోవడం లేదన్నారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను మరింతగా పెంచుకుంటున్నామన్నారు. ఏ ఒక్క కార్యకర్త కూడా తమ విశ్వాసాన్ని కోల్పోలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.  ప్రతి కార్యక్రమంలోనూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతామన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే  అంతు తేలుస్తామన్న పరిస్థితి ఏపీలో కొనసాగుతుందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముస్సోలియన్  , ముషారఫ్ , తాలిబాన్ పాలన లాగ టీడీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతే మీడియాకు ఉంటుందని...తప్పును తప్పుగా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 
మీడియా అదే పనిగా లేనిది ఉన్నట్లు చూపుతూ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. మీడియా అంటే తమకు గౌరవముందని, కొన్ని ఛానళ్లు రాసే రాతలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజల తరపున పోరాడుతూ, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేందుకు వైఎస్సార్సీపీ  ఎప్పుడూ ముందుంటుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పిన మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు..ఈ రెండేళ్లలో ఎంత ముందుకు తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.  పోయినవాళ్లను కుటుంబసభ్యులు ఏవిధంగా నిలదీస్తున్నారో అందరూ గమనించాలన్నారు. పచ్చ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు  రాజీనామా చేయకపోవడం చట్టవ్యతిరేకమన్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో బాబు చెప్పాలన్నారు. చంద్రబాబు కేంద్రంతో రాజీపడడం పల్లే బడ్జెట్లో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Back to Top