మరో ప్రజా ప్రస్థానంలో 2000 కి.మీ

హైదరాబాద్, 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామానికి చేరేసరికి 2000 కిలోమీటర్లు పూర్తిచేశారు.

రికార్డుల కోసం చేపట్టిన పాదయాత్ర కానప్పటికీ.. దేశంలో ఏ మహిళా చేయనటువంటి ఘనతను శ్రీమతి షర్మిల సాధించారు. ఈ ఘనతను సాధించే సమయానికి ఆమె వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆమె తల్లీ, పార్టీ గౌరవాధ్యక్షురాలు అయిన శ్రీమతి విజయమ్మ ఉన్నారు.
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద కిందటేడాది అక్టోబర్ 18న శ్రీమతి షర్మిల యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకూ, ఆ పార్టీకి వంతపాడుతున్న టీడీపీ వైఖరికీ నిరసనగా ఆమె మరో ప్రజా ప్రస్థానం చేపట్టారు. తన పాదయాత్రలో ఆమె తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. గ్రామీణ మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు, పిల్లలు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆమె తన యాత్రలో పలుకరించారు. అనేక సభలలో ప్రసంగించారు.

శ్రీమతి షర్మిల చేస్తున్న ఈ మహా యాత్ర యావద్దేశాన్ని ఆకర్షించింది. ఆమె నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలలో ప్రజలతో మమేకమయ్యారు. ఏర్పాటు చేసిన బహిరంగా సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి కుమార్తెను చూశారు. ఆమె చెప్పింది విన్నారు. భరోసా నిండిన హృదయాలతో తిరిగి వెళ్ళారు.

2004 సంవత్సరానికి పూర్వ సంఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఆమె పాదయాత్రను తలపెట్టారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 2003 సంవత్సరంలో మండువేసవిలో ప్రజా ప్రస్థానం చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలో పట్టించుకోని సమస్యలను మహానేత పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మహానేత యాత్రను గుర్తుచేస్తోంది.

శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభలకు, రచ్చబండలకు వెల్లువెత్తారు. ప్రతి ఒక్కరు ఆమెతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ఏరకంగా నీరుగార్చింది వివరించారు. తమ సమస్యలను ఆమెకు చెప్పుకుని స్వాంతన పొందారు. సమస్యల చట్రంలో ఇరుక్కుని ఇక్కట్లు పడుతున్న ప్రజానీకానికి భరోసా కల్పించడంలోనూ.. వారిలో నైతిక స్థైర్యాన్ని నింపడంలోనూ ఆమె సఫలీకృతులయ్యారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న రాజ్యం స్థాపిస్తారనీ, అందరి ఇక్కట్లూ తీరుస్తారనీ ఆమె ప్రజలకు భరోసా కల్పిస్తూ మరో ప్రజా ప్రస్థానంలో అభిమాన జన కెరటాల నడుమ పాదయాత్ర సాగిస్తున్నారు.

Back to Top