మరో ప్రజాప్రస్థానానికి నేడు కూడా విరామం

ఇంజాపూర్‌ (రంగారెడ్డి జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న చారిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు మూడవ రోజు సోమవారం కూడ విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిల కుడి మోకాలిచిప్పకు తగిలిన గాయం నొప్పి తీవ్రత పెరిగింది. దీనితో ఆమె మరో రోజు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని ఆర్థోపెడిక్‌ వైద్యులు సూచించారు.

ఆర్థోపెడిక్ వైద్యులు డాక్ట‌ర్ విద్యాసాగ‌ర్, ‌సిఎస్ రెడ్డి, శివభార‌త్ రెడ్డి శ్రీమతి షర్మిలను వేర్వేరుగా పరీక్షించారు. శ్రీమతి షర్మిలకు అయిన గాయాన్ని వైద్య పరిభాషలో లిగ్మెంట్ ఇం‌జురీ అంటారని సిఎస్ రెడ్డి ‌వివరించారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లోని బస కేంద్రంలో ఉన్న శ్రీమతి షర్మిలను ఆదివారంనాడు వైద్యులు దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్కు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎమ్మారై స్కానింగ్ చేశారు. స్కానింగ్ ‌నివేదికలు సోమవారం అందుతాయని వైద్యులు తెలిపారు.

కాగా, శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు సోమవారం కూడా విరామం ఉంటుందని వైయస్‌ఆర్‌ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శ్రీమతి షర్మిలను ఆదివారం పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు రాజ్‌ఠాకూర్, పుత్తా ప్రతా‌ప్, దేప భాస్క‌ర్‌రెడ్డి తదితరులున్నారు.

తాజా ఫోటోలు

Back to Top