బడ్జెట్ నిండా బోలెడు లోపాలు

హైదరాబాద్) ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన విధానం
లోపభూయిష్టంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అభిప్రాయ
పడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్
సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ అనేక అంశాల్ని
లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వీటిపైన స్పందన
లేదని ఆయన అన్నారు. మంది బలంతో ప్రభుత్వం జవాబులు చెప్పకుండా బిల్లుల్ని
ఆమోదించుకొందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమైన అభ్యంతరాల్ని ప్రెస్ మీట్ లో
విశదీకరించారు.

1.     2014..15 ఆర్థిక
సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ ను బడ్జెట్ తో పాటు ఎందుకు అందించలేదు. ఏడు
బడ్జెట్ లను ప్రవేశ పెట్టామని గొప్పగా చెప్పుకొనే మీకు ఈ విషయం తెలీదా. గడచిన 60
ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అంటే చట్ట సభల సభ్యుల నుంచి, ఈ రాష్ట్ర ప్రజలకు
తెలియకుండా మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

2.     2014..15 కు సంబంధించిన
కాగ్ లేవనెత్తిన సందేహాలు ఇలా ఉన్నాయి.

‘‘ ద్రవ్య పరపతి లో సంస్కరణల్ని ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం
పాటించటం లేదు. ఎనిమిదేళ్లుగా మిగులు రెవిన్యూ లో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఏడాది లోటు
లోకి మళ్లించారు. రూ. 24,194 కోట్ల లోటు ని తెచ్చి పెట్టారు. అటు ఎఫ్ఆర్బీఎమ్
చట్టం ప్రకారం ద్రవ్య లోటు 3 శాతానికి మించకూడదు. కానీ, 6.10శాతాన్ని దాటిపోయింది.
రూ. 31,717 కోట్లకు చేరిపోయింది. జీఎస్డీపీ లో 27.60 శాతాన్ని అప్పులు దాటకూడదని
చట్టాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ... 32.03శాతానికి చేరిపోయాయి.

3.     ఎనిమిది ఆర్థిక
సంవత్సరాలుగా మిగులు రెవిన్యూ ఆర్జిస్తున్న రాష్ట్రం ఒక్కసారిగా 2014..15 లో 24,
194 కోట్ల లోటులోకి తెచ్చిపెట్టారనేది నాకు వింతగా ఉంది. ఎప్ ఆర్ బీ ఎమ్ చట్టం
అనుమతించకపోయినప్పటికీ ద్రవ్యలోటు 6.1శాతానికి తీసుకొస్తారు.

4.     ద్రవ్య లోటు 6.1 శాతానికి
తెచ్చుకొనేందుకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొన్నారా..దీన్ని
బహిర్గతం చేయగలరా..లేనట్లయితే, దీన్ని అపరిమితంగా తెచ్చుకొనేందుకు ఎవరు
అనుమతించారు. ఇది చట్టాల్ని ఉల్లంఘించటం కాదా.

5.     2014..15లో పబ్లిక్
డిపాజిట్లను రూ. 22వేల కోట్ల మేర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వాడుకోవటాన్ని తప్పు
పడుతున్నాం. ఆ కారణంగా ప్రణాళికా వ్యయానికి కళ్లెం వేసినట్లుగ కనిపిస్తోంది.
వాస్తవానికి ఇది మసిపూసి మారేడు కాయ చేయటం మాత్రమే.

6.     బడ్జెట్ ప్రసంగంలోని 16వ
పేరా గ్రాఫ్ ను ఇక్కడ ఉదహరిస్తున్నా.

‘‘అశాస్త్రీయంగా విభజన చేసినందున 58.32 శాతం జనాభా ఉన్న
రాష్ట్రానికి 46 శాతం మాత్రమే రెవిన్యూ ని పంచారు. దీని కారణంగా కొత్త రాష్ట్రం
ఏర్పడిన 10 నెలల్లోనే రూ. 16,200 కోట్ల మేర రెవిన్యూ లోటు ఏర్పడిందని గౌరవ సభ్యులు
గుర్తెరగాలి’’.

7.     2014..15 సంవత్సరంలో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి కాగ్ నివేదికలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 దాకా చూసుకొంటేరెవిన్యూ లోటుకి సంబంధించిన గణాంకాలు తప్పు అని
తెలుస్తుంది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్, నెలవారీ
పింఛన్లు వెయ్యి రూపాయిలతో పాటు రుణమాఫీ అమలు చేసింది. అయినప్పటికీ తెలంగాణ
ప్రభుత్వం మిగులు లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 24,194 కోట్ల లోటు
తెచ్చుకోవటానికి కారణం ఏమిటి.

8.     2015..16, 2016..17 ఆర్థిక
సంవత్సరాలకు గాను వ్రద్ధి రేటు ను పెంచి చూపించటాన్ని మేం తప్పు పడుతున్నాం.
ముఖ్యంగా రెండేళ్లుగా కరువు తాండవిస్తున్నా.. పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ ల్లో
ప్రగతిని ఎలా చూపగలుగుతున్నారు. పెంచి చూపించే కార్యక్రమం ఎందుకంటే డబ్బులను
ఎక్కువగా గుంజేందుకు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గమనించే కేంద్ర ప్రభుత్వం
గణాంకాలను తగ్గించి మాత్రమే పరిగణనలోకి తీసుకొంది.

9.     ఈ ప్రశ్నలకు రాష్ట్ర
ప్రభుత్వం సంత్రప్తికరమైన జవాబులు ఇస్తుందని ఆశిస్తున్నాం.

10.                       
లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా మేం కాగ్, సీఎస్ వో లను
దర్యాప్తు జరిపించాల్సిందిగా విజ్నప్తి చేస్తాం. 

Back to Top