మనీ స్కాం దోషుల‌ను శిక్షించండి: షర్మిల డిమాండ్

కర్నూలు, 9 నవంబర్‌ 2012: కర్నూలు జిల్లాలోని ఎం. అగ్రహారం  ప్రజలు షర్మిలకు తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య శ్రీ సేవలు అస్సలు అందడంలేదని, మంచినీరు, విద్యుత్‌ సరఫరా లేవని వారు షర్మిల ముందు వాపోయారు. తమ గ్రామాలకు బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థినీ విద్యార్థులు మొరపెట్టుకున్నారు. తమ గ్రామంలో జరిగిన ఆర్థిక కుంభకోణం గురించి కూడా ప్రజలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. తమ గ్రామంలోని రైతులు, ఇతరుల నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుని కొందరు మోసగించారని చెప్పారు. షర్మిల 23వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర కర్నూలు జిల్లాలోని మద్దికెర నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రోజు పాదయాత్రలో షర్మిల దాదాపు 16 కిలో మీటర్లు నడవనున్నారు.

ఎం. అగ్రహారం గ్రామంలో రెండు వందల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణం జరిగిందని, దీని వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ప్రజలు షర్మిలకు చెప్పారు.‌ వారి ఫిర్యాదుపై షర్మిల స్పందిస్తూ, ఎం. అగ్రహారంలో ఆర్థిక కుంభకోణం జరిగి చాలా మంది రైతులు మోసపోయారన్న విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న రైతుల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మోసగాళ్ళకు అధికార పక్షం ఎంపీ మద్దతు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఆ మద్దతును వాడుకుని రైతులను ఆర్థిక మోసగాళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, మోసగాళ్ళపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పొట్ట కొట్ట వద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. మోసపోయిన రైతులకు సొమ్ము తిరిగివచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రజల ఫిర్యాదుపై స్పందించిన షర్మిల మనీ స్కాంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి తమ గ్రామంలో ఉందని మహిళలు చెప్పినప్పుడు షర్మిల చలించిపోయారు. హంద్రీ నీవా పథకం పూర్తయితే సాగునీరు, తాగునీరు కూడా వచ్చేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
Back to Top