మంత్రి ఆనంకు మతిభ్రమించింది: వైయస్ఆర్ సీఎల్పీ

హైదరాబాద్ 12 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మతిభ్రమించే ఆరోపణలు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచరీ కమిటీ మండిపడింది. ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చేర్చాలని కోరింది. ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆయన ప్రవర్తన, మానసిక స్థితి చూస్తుంటే మంత్రి పదవికీ, ప్రజా జీవితానికీ ఆనం అనర్హుడని తేలిపోయిందని పేర్కొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి తట్టుకోలేక, రానున్న ఎన్నికల్లో ధరావతు కూడా రాదనే భయంతో ఆనం మతి భ్రమించి వైయస్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అభిప్రాయపడింది. పదవి కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలనీ, లేకుంటే ప్రజలు ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారనీ కమిటీ హెచ్చరించింది. ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెల్లం బాలరాజు ఈ ప్రకటనపై సంతకాలు చేశారు.

నెల్లూరు జిల్లాలో ఇటీవలి ఉప ఎన్నికలలో ఆనం కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గాలలో వీచిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిన విషయాన్ని వారు గుర్తుచేశారు. మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలబై వేల ఓట్లు, ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 35 వేల ఓట్లు, ఉదయగిరిలో దాదాపు 30వేల ఓట్లు ఆధిక్యత లభించిందన్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో దాదాపు మూడు లక్షల మెజార్జీ అభించిందనీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారనీ వారు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందనీ, నెల్లూరు ప్రజలు తమను వెలివేస్తారనే భీతితో మతిభ్రమించిందనీ పేర్కొన్నారు. అందుకే మహానేత కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలను చేస్తున్నారన్నారు.  మంత్రి తక్షణం క్షమాపణ చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది.

Back to Top