పాలన బ్రహ్మాండంగా ఉంటే డబ్బులెందుకు పంచడం

  • అభివృద్ధి చూపి ఓట్లడిగే దమ్ము బాబుకు లేదు
  • పీ3తో గెలవాలని టీడీపీ నేతలకు రెండ్రోజుల వర్క్‌షాపు
  • ప్రజలు మీవైపే ఉంటే ప్రతిపక్షంపై విమర్శలెందుకు
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించేదెవరో ఆత్మ పరిశీలన చేసుకో బాబూ
  • పాలన అస్తవ్యస్థంగా ఉన్నా.. బలంగా ఉన్నట్లు ప్రచారం..
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు
విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఎన్నికల్లో డబ్బులు పంచడం ఎందుకని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు చంద్రబాబును ప్రశ్నించారు. మూడున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి చూపించి ప్రజలను ఓట్లడిగే దమ్ము లేక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీ3 (పోలీస్, పర్చెజ్, పోలవరం)తో ఎన్నికల్లో గెలవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు రెండు రోజలు క్లాస్‌లు తీసుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నేతలకు క్లాస్‌లు ఇవ్వడం ఇది 352వ మారు అని ఎద్దేవా చేశారు. పోలీస్, పర్చెజ్, పోలవరం ఈ మూడే గెలిపిస్తాయని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం దుర్మార్గమన్నారు. వర్క్‌షాపులో బాబు మాటలను విష్ణు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజల పాలన కాదు.. అవినీతి పాలన అని విమర్శించారు. 

అధికార పార్టీ కంటే ప్రతిపక్షమే బలంగా ఉంది...
రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విష్ణు అన్నారు. ప్రజలు మీవైపే ఉంటే మరి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వర్క్‌షాపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీనే బలంగా ఉందని ప్రజలందరికీ అర్థమైందన్నారు. 2019 ఎన్నికల్లో కాకినాడ, నంద్యాల ట్రెండ్‌ను తీసుకెళ్లాలని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీని చూస్తుంటే మీసాలకు సంపెంగ నూనె రాసుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ పరిపాలన తీరు అంతా బ్రహ్మాండంగా ఉంటే పోల్‌ మేనేజ్‌మెంట్, డబ్బులు పంచడం, పోలీసులను ఉపయోగించడం ఎందుకని ప్రశ్నించారు. 

ఐపీఎస్‌పై దాడి చేసిందెవరు బాబూ?
చంద్రబాబు ఒకర్ని విమర్శించే ముందు మీ మూడున్నర పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మల్లాది విష్ణు సూచించారు. వైయస్‌ఆర్‌ సీపీ శాంతిభద్రతలకు భంగం కల్పిస్తుందని మాట్లాడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విజయవాడ నడిరోడ్డుపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిపై దాడి చేశారని గుర్తు చేశారు. ఎవరూ విజయవాడలో శాంతి భద్రతలకు భంగం కల్పిస్తున్నారో చంద్రబాబు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేక మచ్చను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి చర్యలకు పూనుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిన తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదని చెప్పారు. డబ్బులు పంచి ఒక ఉప ఎన్నిక, కార్పొరేషన్‌ ఎన్నికలో గెలిచి టీడీపీ పాలన అస్తవ్యస్థంగా ఉన్నా.. బలంగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టులు, కమీషన్లకు చేతిలోకి తీసుకొని మహానేత వైయస్‌ఆర్‌ నిర్మించి కాలువలో పట్టిసీమ, పురుషోత్తపట్నం అని చెప్పకుంటూ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. 
Back to Top