హైదరాబాద్ 08 మార్చి 2013:మహిళా సాధికారిత కోసం వైయస్ఆర్ తపించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కేక్ కట్ చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని వైయస్ఆర్ తపించారని ఆమె పేర్కొన్నారు. వైయస్ఆర్ మరణం తర్వాత ఆయన పథకాలను అటకెక్కించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్ వారసుడిగా జగన్ ఆయన పథకాలను కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జగన్ సారథ్యంలో అభివృద్ధి పథంలో సాగుదామని చెప్పారు. జగన్ సీఎం అయితే 'అమ్మ ఒడి' పథకాన్ని అమలుచేస్తారని తెలిపారు. ప్రతి బిడ్డకు రూ. 500 చొప్పున బ్యాంకులో వేస్తామన్నారు. అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా నేత రోజా కూడా ప్రసంగించారు. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, విజయారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.