<strong>అనంతపురం:</strong> దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి మహిళలు లక్ష వత్తులతో దీపోత్సవం నిర్వహించి, నివాళులు అర్పించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అనంతపురం వైయస్‌ఆర్ సిపి మహిళా విభాగం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతపురం సుభాష్ రోడ్డులో ఉన్న వైయస్ఆర్ విగ్రహం వద్ద ఇలా లక్ష వత్తులతో దీపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా మహిళా విభాగం నాయకులు బోయ సుశీలమ్మ, శ్రీదేవి, ఉషారాణి మాట్లాడుతూ, మహానేత వైయస్ మరణించినప్పటి నుంచీ ప్రతి ఏటా కార్తీక మాసం మూడవ సోమవారం దీపాలంకరణ చేసి ఆయనకు నివాళులర్పిస్తున్నామన్నారు.<br/>రాష్ట్ర ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత వైయస్ పేద ప్రజలకు దేవుడే అన్నారు. ఎంతో మంది చీకటి జీవితాలకు వెలుగు నింపిన మహోన్నతుడు అని కొనియాడారు. వైయస్‌ఆర్ ఆశీస్సులు జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి, ప్రజలకు అవసరం అన్నారు. త్వరలోనే యువనేత బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు కదిరి నిర్మల, అంకిరెడ్డి ప్రమీల, కె. ప్రమీల, నాగలక్ష్మి, శివమ్మ, మల్లేశ్వరి, లక్ష్మి శ్రీనివాస్, లలిత, పద్మ, లీల, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.