<strong>పులివెందుల (వైయస్‌ఆర్ జిల్లా) : </strong>మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే శ్రీమతి వైయస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఆ పథకాల అమలు సాధ్యమని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సుమారు 30 మంది మహిళలు శనివారం మధ్యాహ్నం శ్రీమతి విజయమ్మను కలిశారు. పులివెందులలోని శ్రీ వైయస్ జగన్ నివాసంలో తనను కలిసిన వారితో ఆమె మాట్లాడారు.<br/>శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా సిబిఐ ఇబ్బందులు పెడుతున్న వైనంతో పాటు రాష్ట్రంలో పథకాలు సక్రమంగా అమలు కాలేదని వారు ఈ సందర్భంగా విజయమ్మ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడని, అందుకే అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం పరితపించారని అన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు 108, ఫీజు రీయింబర్సుమెంటు, పావలా వడ్డీ లాంటి పథకాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని ఆమె వివరించారు.<br/>మహానేత, తన తండ్రి వైయస్‌ఆర్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకు సువర్ణ యుగాన్ని అందిస్తారని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శ్రీ జగన్ కోసం ఎదురు చూస్తున్నారని, దేవుడి ఆశీర్వాదంతో త్వరలో మంచి రోజులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్ కుటుంబానికి అండగా నిలబడతామంటూ ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మకు మహిళలు తెలిపారు. దేవుడి దయవల్ల అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు శ్రీమతి విజయమ్మ వారితో అన్నారు.