మేము సైతం..మేము సైతం...

అనంతపురం

26 అక్టోబర్ 2012 : అభిమానం అంబరమంత. అర్ణవమంత...! సాధారణంగా వీరాభిమానం తమిళ రాజకీయాలలోనే చూస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ లోనూ మహానేత అన్నా, జననేత అన్నా గుండెల్లో దాచుకునేవారు వేనవేలు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన గజ్జల కృష్ణారెడ్డి వారిలో ఒకరు. ఆయన ప్రస్తుతం షర్మిల వెంట పాదయాత్రలో నడుస్తున్నారు. అదీ కాళ్లకు చెప్పులు లేకుండానే. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రస్థానంలో షర్మిల వెంట నడుస్తానని ఆయన చెబుతున్నారు. నాడు వైయస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసినప్పుడు కృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా కోట మండలం నుంచి 500 కి.మీలు మహానేత వెంట నడిచారు. వైయస్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆనాడు ఆ పాదయాత్రలో పాల్గొన్నానని, ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం నడుస్తున్నానని కృష్ణారెడ్డి తన అభిమానాన్ని ప్రకటించారు. కృష్ణారెడ్డి మాత్రమే కాదు  ప్రకాశం జిల్లాకు ఇరుసులగుండానికి చెందిన సుబ్బారెడ్డి కూడా ఇంతే. వైయస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించడంలో అది సుబ్బారెడ్డికి లాభించింది. అప్పటి నుంచి వైయస్ ఏం చేసినా నిండు మనసుతో మద్దతిస్తూ వచ్చారు. వైయస్ అంటే ఆయనకు ప్రాణం. అదే వీరాభిమానంతో ఇప్పుడు షర్మిలతోపాటు ఇచ్ఛాపురం వరకు ఆయన సైతం నడుస్తున్నారు. ఇలాంటివారు ఎందరో...

Back to Top