మదనపల్లె విద్యుత్ ‌ఉప కేంద్రం గేట్లకు తాళం

తిరుపతి : విద్యుత్ చార్జీల పెంపు‌ ప్రతిపాదనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిర్వహించిన నిరసనలు, ధర్నాలతో చిత్తూరు జిల్లా దద్దరిల్లింది. వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యుత్ స‌బ్‌స్టేషన్లను ముట్టడించారు. ఈ ఆందోళనల్లో ప్రజలు, ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళనలు నిర్వహించారు. చిత్తూరుతో పాటు, అన్ని నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు మిన్నుముట్టాయి.

ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి అధ్వర్యంలో మదనపల్లెలోని డివిజనల్ స‌బ్ స్టేష‌న్‌ను పార్టీ శ్రేణులు ముట్టడించి, గేట్లకు తాళం వేశారు. అక్కడే కూర్చొని దాదాపు గంటన్నర పాటు ఆందోళన చేశారు. తరువాత ట్రాన్సుకో ఏడీఈ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సబ్‌స్టేషన్ వద్ద‌ ధర్నా చేశారు.

తిరుపతిలోని తుడా కార్యాలయం వద్ద ఉన్న‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు రాత్రి లాంతర్లతో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులోని గాంధీ రోడ్డు‌లోని విద్యు‌త్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు డీఈ కార్యాలయాన్ని దిగ్బంధించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పేరూరు మండలంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

నగరిలో విద్యుత్ స‌బ్‌స్టేషన్‌ను వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తలతో ముట్టడించారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం అప్పలాయగుంట విద్యుత్ స‌బ్‌స్టేషన్‌ను ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముట్టడించారు. సహాయ ఇంజనీరు కార్యాలయానికి తాళం వేసి, సిబ్బందిని లోపలకు అనుమతించలేదు. విద్యుత్ చార్జీలకు తనకు సంబంధం లేదని, పూర్తి స్థాయిలో‌ విద్యు‌త్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తానని ఆందోళనకారులకు సహాయ ఇంజనీర్‌ హామీ ఇచ్చారు.

విజయపురంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ స‌బ్ స్టేషన్లను ముట్టడించారు. ఎ‌స్ఆ‌ర్‌పురంలో, వెదురుకుప్పంలో, పెనుమూరులో, జిడి నెల్లూరులో విద్యుత్ స‌బ్‌స్టేషన్లను ముట్టడించారు. తరువాత ధర్నా చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం పల్లం విద్యుత్‌ ఉప కేంద్రాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించారు. పుంగనూరు సబ్‌స్టేషన్ గేటుకు తాళం వేసి, దాదాపు గంట పాటు రాస్తారోకో చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాల్లోని విద్యుత్ స‌బ్‌స్టేషన్లను పార్టీ కార్యకర్తలు ముట్టడించారు.

పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో విద్యుత్ స‌బ్‌స్టేషన్‌ను ముట్టడించారు. చెన్నై-బెంగళూరు రహదారిలోని సబ్‌స్టేషన్ ఎదురుగా వందలాది మంది రైతులు, పలువురు కుటీర పరిశ్రమల‌ కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు.  తంబళపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ స‌బ్‌స్టేషన్లను వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు ముట్టడించారు. నిండ్రలో విద్యుత్‌ ఉప కేంద్రాన్ని ముట్టడించారు.
Back to Top