బాబు తప్పుడు లెక్కలతో రాష్ట్రానికి నష్టం

– జీడీపీ అంత బాగుంటే అభివృద్ధి జరగలేదే
– తాత్కాలిక లెక్కలతో పబ్లిసిటీ కోసం బాబు తహతహ
– సీఎం తీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు 
– అసత్యాలు ప్రచారం చేసి ఎంతోకాలం మనలేరు
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్ధసారథి

హైదరాబాద్‌: చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని పబ్లిసిటీ, ధనార్జనకు వాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జీవించి ఉన్న ముఖ్యమంత్రుల్లో సీనియర్‌ మోస్ట్‌గా ఉన్న చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సింది పోయి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం రాష్ట్రానికి అంత మంచిది కాదన్నారు. జీడీపీలు, పెట్టుబడుల పేరుతో బాబు చెప్పే తప్పుడు లెక్కల కారణంగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. 

జీడీపీ పెరిగితే రెవెన్యూ పెరిగాలిగా
ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ జీడీపీ కేంద్రాన్ని మించి పోయిందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. బాబు చెప్పే లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీ 10.99గా ఉన్నప్పుడు రెవెన్యూ కూడా 30 శాతం వరకు పెరగాలి.. కానీ 15శాతమే చూపించడం చూస్తుంటే ఏవో అవకతవకలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రపంచంలో ఏ ఆర్థికవేత్తను, నోబెల్‌ బహుమతి గ్రహీతలను అడిగినా ఇదే చెబుతారు.. కానీ బాబు లెక్కలు మాత్రం వాస్తవ విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆనాడు చంకలు గుద్దుకున్నారని వాస్తవానికి ఒక్క పైసా కూడా పెట్టుబడులు తేలేకపోయారని పేర్కొన్నారు. బాబు చేసే ఇలాంటి డాబుసరి కూతలతో కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపించారు. ఆదాయంలో కేంద్రాన్ని మించి అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రానికి, 4.5లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చుకున్న ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం అనుకుని ఉండొచ్చని తెలిపారు. బాబు పబ్లిసిటీ కోసం చేసే పచ్చి లెక్కల కారణంగా రాష్ట్ర ప్రజలంతా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు వచ్చేవి, ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరిగేదని బాబు పబ్లిసిటీ కారణంగా అవేవీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనితీరు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడేమో జీడీపీలంటూ జనానికి అర్థం కాని భాషలో మాట్లాడే చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదేంటని ప్రశ్నిస్తే మాత్రం రాష్ట్రం పేదరికంలో ఉంది.. కేంద్రం సహాయం చేయడం లేదని వారి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏవో సాకులు చెప్పి బాబు తప్పించుకోవడం చూస్తుంటే ‘ఆడలేక మద్దెల దరువు’ అన్నట్టుందని అన్నారు.

ఆ రాష్ట్రాలు ఏపీ కన్నా ముందున్నాయిగా
ఇటీవల బాబు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రం జీడీపీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పడాన్ని పార్ధసారథి తీవ్రంగా ఆక్షేపించారు. వివిధ రాష్ట్రాల జీడీపీ లెక్కలను ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. జార్ఖండ్, చండీఘర్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు జీడీపీలో ఏపీని వెనక్కి నెట్టిన విషయాన్ని పేర్కొనలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ ఉంటే ఉండొచ్చేమో కానీ ఆయన పిచ్చిలెక్కలను రాష్ట్రం మీద రుద్ది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయవద్దని సూచించారు. ఏదైనా పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే సొంత విషయాల్లో చేసుకోవాలి తప్ప ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ తాత్కాలిక ప్రయోజనాలకే తప్ప రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతమాత్రం ఉపయోగ పడవని తెలిపారు. తెలిసీ తెలియక ఆయన తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. 
Back to Top