దమ్ము లేకే దొడ్డిదారిలో లోకేష్

  • రాజధానిలో బాబు, లోకేష్ ల విచ్చలవిడి దోపిడీ
  • నూతన అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని దూరం
  • ప్రజల్లో గెలిచే సత్తా లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీగా లోకేష్
  • కుంభకర్ణుడిలా నిద్రపోతున్న బాబును ముల్లుకర్రతో పొడుస్తాం
  • ప్రతీ నిరుద్యోగికి రూ.2వేలు ఇచ్చేవరకు బాబు వెంటపడుతాం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరుః రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేష్ లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడడం వల్లే  తాత్కాలిక అసెంబ్లీని ప్రారంభించేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సముఖంగా లేరని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సింగపూర్, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు..చివరకు తాత్కాలిక భవనాల్లో శాసనసభ, మండలిని ఏర్పాటు చేయడం బాధాకరమని అన్నారు. ఏడాదిన్నర క్రితం నూతన రాజధానికి బాబు మోడీ చేత శంకుస్థాపన చేయించారని, ఇంకా ఆ రాయి వెక్కిరిస్తూనే ఉందని అన్నారు. భవనాన్ని ప్రారంభించేందుకు ప్రధాని కార్యాలయం చిన్నచూపుగా భావించిందంటే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.  

ప్రతీ చిన్న కార్యక్రమానికి వందల, వేల కోట్లు వెచ్చించి ఈవెంట్ లా చేసే చంద్రబాబు, సింపుల్ గా తన చేతులతోనే అసెంబ్లీని ప్రారంభించే దశకు వచ్చారంటే...అన్ని చోట్ల దోపిడీ చేస్తున్నాడని ప్రధానికి తెలిసిపోయే సిగ్గు వేసి ప్రారంభానికి రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు.  
 బాబు, లోకేష్ లు రాజధాని నిర్మాణంలో వందల కోట్లు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.రూ. రాజధానిలో వేలకోట్లు కమీషన్ లు నొక్కేసి లోకేష్ హైదరాబాద్ లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాడని అంబటి తూర్పారబట్టారు. తాత్కాలిక భవనాల నిర్మాణానికి ముందు రూ.200కోట్లు కేటాయించి.. ఆ తర్వాత రూ. 700 కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.  

చంద్రబాబు తన కొడుకును ప్రజల్లోంచి కాకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా తీసుకొస్తున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  ఏపీలో సన్ రైజ్ తూర్పున కాకుండా మరోవైపున జరుగుతోందని చురక అంటించారు. శాసనమండలిని వేస్ట్ గా భావించి ఎన్టీఆర్ తన హయాంలో రద్దు చేస్తే...అదే మండలి ద్వారా చంద్రబాబు తన కొడుకును తీసుకోవాలనుకోవడంపై అంబటి చలోక్తులు విసిరారు. ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా వస్తుందన్న భయంతోనే బాబు లోకేష్ ను ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రిని చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రజల్లో గెలిచే సత్తా లేని లోకేష్ వైయస్ జగన్ కు చాలెంజ్ లు విసరడం హాస్యాస్పదమని అన్నారు.  దమ్మూ, దైర్యం ఉంటే బాబు, బాబు తన కొడుకును నాయకుడిగా తలుచుకోవాలంటే, ప్రజల్లోంచి గెలుపొంది రావాలని అంబటి సవాల్ విసిరారు. 

బాబుకు మూడేళ్ల తర్వాత నిరుద్యోగభృతి ఇవ్వాలనే  ఆలోచన వచ్చిందంటే అది ప్రధాన ప్రతిపక్షం  వల్లేనని అంబటి స్పష్టం చేశారు. బాకీ పడిన ప్రతీ నిరుద్యోగికి భృతి చెల్లించాలని వైయస్ జగన్ లేఖ రాయడం వల్లే బాబులో చలనం వచ్చిందన్నారు.  వైయస్ జగన్ యువభేరిలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు చేసిన ఆక్రందన ఇప్పటికైనా బాబు చెవిన  చేరినందుకు సంతోషకరమన్నారు. ఐతే, చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని...నిరుద్యోగులకు భృతి ఇస్తాడనుకుంటే అది పొరపాటేనని అన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ అంటూ రేట్ లు కడతారని, అలాంటి చరిత్ర బాబుదని మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ..కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పి బాబు ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్లను మాయమాటలతో మోసగించడానికి బాబు ఎత్తుగడలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కుంభకర్ణుడిలా నిద్రపోతున్న బాబును వైయస్ జగన్ ముల్లుకర్రతో పొడుస్తూనే ఉంటారని అంబటి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.2వేలు భృతి చేరేవరకు చంద్రబాబు వెంటపడుతామని అంబటి చెప్పారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో బాబును పొడవడం ఖాయమని అన్నారు. 

Back to Top