నిజమాబాద్ 02 జూలై 2013:
పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని రాజశేఖరరెడ్డిగారికి ముందు.. తరవాత.. ప్రస్తుత పరిస్థితులను వివరించడానికి మీముందుకు వచ్చానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలిపారు. నిజమాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటైన కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాజశేఖర రెడ్డిగారి ఉన్నతికి కార్యకర్తలే కారణమని చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడూ కార్యకర్తలకు తోడుగా ఉంటుందని తెలిపారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి పంచాయతీ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. మిగిలిన పార్టీలకు సమష్టిగా ఎన్నికలలో విజయం సాధించి మన సత్తా చూపాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు ప్రయత్నించి... పార్టీని పటిష్టపరచాలని కోరారు. కార్యకర్తలు ప్రజా ప్రతినిధులుగా ఎంపికవ్వాలని కోరారు.
స్థానిక ఎన్నికలు సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలు సమస్యలతో కునారిల్లుతున్నాయని చెప్పారు. ఉన్న ప్రత్యేకాధికారులు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికైన ప్రతినిధులైతే ప్రజలకు జవాబుదారీగా ఉంటారన్నారు. స్థానిక సంస్థలకు నిధులూ, విధులూ లేవన్నారు. చంద్రబాబు హయాంలో స్థానిక సంస్థలకు చెందిన వేల కోట్ల రూపాయలను వేరే పనులకు మళ్ళించారన్నారు. రాజన్న తన హయాంలో ప్రజా ప్రతినిధులకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చిందీ సవివరంగా వివరించారు.
ప్రస్తుత పరిస్థితులు రాజశేఖరరెడ్డిగారి పాలనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పింఛన్లు తగ్గించేశారనీ, ఇళ్ళ నిర్మాణమే లేదనీ తెలిపారు. గ్యాస్ ధర పెరిగితే ఆనాటి రాజన్న ప్రభుత్వం భరించిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు, 108, 104 సర్వీసులు పత్తాలేవన్నారు. రైతులకు ఆసరాగా నిలిచేవారే లేకపోయారన్నారు. ఆయన హయాంలో అన్ని రకాల మేళ్లు చేకూరాయని చెప్పారు. ఒక్క పైసా చార్జీ కానీ, పన్ను కాని పెరగని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ అన్ని వర్గాలనూ ఆయన ఆదుకున్నారని తెలిపారు.