ఇచ్చోడ(ఆదిలాబాద్) 01 జూలై 2013:
పంచాయతీ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు సమష్టిగా విజయానికి కృషి చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎదగడానికి స్థానిక ఎన్నికలు ఒక వేదికని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఎదుగుదలలో కార్యకర్తలే ముఖ్యపాత్ర వహించారనీ, మీ మేలు మరవలేమనీ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటైన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు.
రెండేళ్ళుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నెట్టుకొస్తోందనీ, ఇప్పుడు తప్పని సరి పరిస్థితిలో పెడుతోందనీ ఆమె చెప్పారు. ఒకసారి రిజర్వేషన్లనీ, మరోసారి జనభా లెక్కలనీ సాకు చూపిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి రగడ జరుగుతుండటంతో 2011 లో జగన్ బాబు బీసీ జనాభా దామాషా ప్రకారం అందరం బీసీ అభ్యర్థులను పోటీకి పెడదామని సూచించారనీ, దీనికి ఏ పార్టీ స్పందించలేదనీ ఆమె తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులూ, విధులూ అవసరమనీ, ఎన్నికలు లేకపోవడం వల్ల వాటికి దూరమయ్యామనీ చెప్పారు. రాజశేఖరరెడ్డిగారు పంచాయతీలకు ఈ రెండూ కల్పించారనీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కూడా కల్పించారనీ వివరించారు. ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల స్ధానిక సంస్థలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. కరెంటు బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో అవి కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నాయనీ, మంచినీటి కోసం అలమటిస్తున్నాయనీ చెప్పారు.
శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టి ఎన్నికలు పెడుతున్నారన్నారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. స్థానిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులకు తమ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. ప్రతి పంచాయతీలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. జగన్ బాబును, వైయస్ఆర్ సీపీని దెబ్బతీయడం, రాజశేఖరరెడ్డిగారిని అప్రతిష్టపాలు చేయడం లక్ష్యాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని ఆమె కార్యకర్తలను కోరారు. రెండేళ్ళ వయసున్న మన పార్టీ బలపడాలంటే ఈ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవాలన్నారు. మన పార్టీ బలంగా ఉందని అలసత్వం వహించరాదని ఆమె హితవుపలికారు. మీరు వేసే ఓటు జగన్ బాబు నిర్దోషిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. పంచాయతీలో ఎవరు ఏ పదవికి ఎంపిక కావాలో ముందే కూర్చుని చర్చించుకుని ఆమేరకు వ్యవహరించి కలసికట్టుగా విజయం సాధించాలని కోరారు. ఓటింగు, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పది ఓట్లు వచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని కోరారు. ఇందుకోసం ప్రజలతో మమేకం కావాలనీ, వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. వైయస్ఆర్ మాదిరిగా ప్రజలతో కలిసిపోవాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలను ఛేదించాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. రాజశేఖరరెడ్డిగారు.. తన పాలనలో ఏఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందీ కూలంకషంగా వివరించారు. రైతులపై ఆయన చూపిన శ్రద్ధను కూడా తెలిపారు. అన్ని రంగాల అభివృద్దికీ ఆయన ఇతోధికంగా పాటుపడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారన్నారు. ఆయన మరణానంతరం అనేక ప్రాజెక్టులు మూలనపడ్డాయన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ఆయన మానసపుత్రికని శ్రీమతి విజయమ్మ అభివర్ణించారు. అందరి అవసరాలను ప్రభుత్వం తీర్చాలని భావించేవారు. తెలంగాణ వాదాన్ని ఆయన గౌరవించేవారన్నారు. తెలంగాణ ఇవ్వడం కేంద్రం చేతిలో పననీ, అది నెరవేరేలోగా అభివృద్ధి దిశగా నడిపించడం కర్తవ్యంగా భావించారని పేర్కొన్నారు. సాగు నీరు, పారిశ్రామికం, ఇలా అన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విద్యాపరంగా ఆయన ఏర్పాటుచేసిన సంస్థలను ఆమె వివరించారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీ రంగానికి ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని తలమానికంగా తీర్చిదిద్దారని తెలిపారు.
రైతు సమస్యలపై ఆయన ఓ కమిటీని ఏర్పాటుచేసి, ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆత్మహత్యలపై రామచంద్రారెడ్డి అధ్యక్షతన న్యాయ కమిషన్ ఏర్పాటుచేసిన విషయాన్ని కూడా ఆమె జ్ఞాపకం చేశారు. రాజశేఖరరెడ్డిగారు వ్యవసాయ టెక్నాలజీ మిషన్ ఏర్పాటుచేసిన అంశం ఎవరూ మరువలేదన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రాజన్న ఈ జిల్లాలోని హెబ్బటి గ్రామానికి వచ్చినపుడు పొంగిపొర్లుతున్న ప్రాణహిత నదిని చూశారనీ, వీటిని సద్వినియోగం చేసుకోవడానికి 2008 డిసెంబరు 16న సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారని తెలిపారు. అంతర్రాష్ట్ర జల ఒప్పందాల ప్రకారం ఈ నది నుంచి మన 305 టీఎమ్‌సీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కనీసం ఐదు టీఎమ్‌సీలను కూడా వాడుకోలేని పరిస్థితిని గమనించి ఆయన ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. రాజశేఖరరెడ్డిగారుంటే అది ఈరోజుకు పూర్తయిఉండేదన్నారు. ఏడు జిల్లాల్లో 16.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అంది ఉండేదని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కడ వేసి గొంగడి అక్కడే ఉన్నట్లుండటం బాధ కలిగిస్తోందన్నారు. 48 వేల కోట్ల జపాన్ నిధులతో సత్నామ్ ప్రాజెక్టును ఆధునికీకరించాలని తలచారని చెప్పారు. లక్ష్మీపురం వద్ద రిజర్వాయరు కూడా నిర్మించారని తెలిపారు. ఎడమ కాల్వ కింద ఆరు వేల ఎకరాలు, కుడి కాల్వ కింద ఏడు వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. రాణి వాగు ప్రాజెక్టుకు 2004లోనే శంకుస్థాపన చేశారని చెప్పారు. 33.3వేల కోట్లతో ఆరువేల ఎకరాలు సాగయ్యే ప్రాజెక్టుకు కూడా ప్రతిపాదించారని చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య 408 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా చేపట్టారని వివరించారు. 2004లోనే దీనికి శంకుస్థాపన చేసి 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చుపెట్టారని చెప్పారు. అది కూడా నత్త నడక నడుస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కొమరం భీం ప్రాజెక్టుకు 2005లో 274 కోట్ల రూపాయలు మంజూరుచేశారని చెప్పారు. దీనిద్వారా 44,500 ఎకరాలకు సాగునీరందించాలనుకున్నారని తెలిపారు. రాజన్న 65కిలోమీటర్ల కాల్వలు రూపుదిద్దుకున్నాయనీ, మిగిలిన 35కిలోమీటర్ల మేర కాల్వలు ఇంతవరకూ తయారుకాలేదనీ చెప్పారు. వట్టివాగు ప్రాజెక్టు 2006లో ఏడు కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారని తెలిపారు. 2007లో మరోసారి లైనింగ్ మరమ్మతులు చేశారన్నారు. గెడ్డన్నవాగు, తదితర ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతతమాత్రంగానే ఉండిపోయిందన్నారు. భూములు సాగులోకి వస్తాయనుకుంటే రాజన్న ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదని తెలిపారు.
ఆదిలాబాద్ జనాభా 24 లక్షల పైన ఉంటే ఇందులో గిరిజనులే 16 లక్షలు పైబడి ఉన్నారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని రాజశేఖరరెడ్డిగారు అందుబాటులోకి తెచ్చారనీ, 23 కోట్ల రూపాయలు కూడా కేటాయించారనీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మూడు లక్షల ఎకరాలు ఇచ్చారన్నారు. భూములివ్వడమే కాక ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే వెసులుబాటు కూడా మహానేత కల్పించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మహానేత హయాంలోనే గిరిజన బెటాలియన్ ఏర్పాటుచేసి 4500మందికి ఉద్యోగాలుకూడా ఇచ్చిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ జ్ఞాపకం చేశారు.