లక్ష కోట్లు ఎలా మాఫీ చేస్తావ్‌ !

హైదరాబాద్, 20 ఫిబ్రవరి 2013: అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రతినిత్యమూ విమర్శిస్తారు కానీ, ఆయన చేతిలో ఉన్న అస్త్రాన్ని మాత్రం వినియోగించరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో లుకలుకలున్నాయని, అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోయే అవకాశాలెన్నో ఉన్నాయన్నారు. కాని చంద్రబాబు మాత్రం పొరపాటున కూడా అవిశ్వాసం పెట్టే సాహసం చేయరని ఎద్దేవా చేశారు. రైతు రుణాలను మాఫీ చేస్తామంటూ చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, అయితే తనకు అధికారం లేని, లక్ష కోట్లకు పైబడిన రుణాలను ఆయన ఎలా మాఫీ చేయగలరని మేకపాటి నిలదీశారు. ఈ రోజు తనకు అధికారం ఇస్తే, ప్రజలు ఏవి కోరితే ఆ వరాలను ఇస్తానన్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. కాని, దురదృష్టమేమిటంటే చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అస్సలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసం, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌పై అభిమానం ప్రజల్లో మెండుగా ఉన్నాయన్నారు.

వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం తథ్యమని రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టిడిపి రెండింటి పరిస్థితీ ఒకేలా ఉందన్నారు. సంస్థాగతంగా వైయస్‌ఆర్‌సిపి ఇంకా బలపడాల్సి ఉందన్నారు. త్వరలోనే పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఆదేశించారని, గడపగడపకూ వైయస్‌ఆర్‌సిపిని మరింత విస్తృతం చేస్తామన్నారు. బూత్‌, మండల స్థాయి కమిటీలను వేయనున్నట్లు చెప్పారు. బూత్‌ కమిటీల్లో కనీసం 20 మంది సభ్యులను నియమించాలని వారిలో కనీసం 10 మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని శ్రీమతి విజయమ్మ నిర్దేశించారని మేకపాటి తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పదికి పైగా జిల్లాల్లోని పంటలు భారీగా నష్టపోయాయని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఉన్న మిరప, పత్తి పంట ఏ విధంగా నాశమైపోయిందో మనం టివీల్లో చూశామన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, తదితర సమస్యలన్నింటిపైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి గెలుచుకున్నదో గమనించామని మేకపాటి అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాగే ఆ పార్టీ వ్యవహరిస్తుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని, బహుశా అవి కూడా సహకార ఎన్నికల కోవకే వస్తాయని, కాంగ్రెస్‌ నాయకులు ఇంటిలో కూర్చుని రాసుకుని ఎన్నికలు గెలిపించుకునే పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు జనం గుణపాఠం తథ్యం : 
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలందరికీ ఓటు హక్కు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ఆటలు సాగబోవని మేకపాటి హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వాటిని ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందో వేచి చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నది మనందరికీ తెలిసిన విషయం అన్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశారని, ఆ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోడంతో ఆ ఫలితాలు వచ్చాయన్నారు. సహకార ఎన్నికల్లో ఇంటిలో కూర్చుని తమకు కావాల్సిన వారినే ఓటర్లుగా చేర్చుకుని, వైయస్‌ఆర్‌సిపి వారిని సభ్యత్వ నమోదుకు దూరం చేసిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వీటన్నింటిపైనా చర్చించామన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు ప్రతినిత్యం ఏ విధంగా పెరిగిపోతున్నదీ కూడా సమావేశంలో చర్చించామన్నారు. ఈ విషయంపై సమావేశంలో పాల్గొన్న మహిళలు వివరంగా చెప్పారన్నారు. జీవితం ఎంత దుర్బలంగా అయిందో కూడా వారు వివరించారన్నారు. రైతులు, చేనేత కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అన్నీ చర్చించినట్లు మేకపాటి చెప్పారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను నీరుగార్చింది, అప్పటి ఇప్పటి ప్రభుత్వాల పాలన మధ్య ఉన్న తేడాలపైన చర్చ జరిగిందన్నారు. శ్రీమతి విజయమ్మ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు నడుచుకుని మరింత ముందుకు సాగుతామని రాజమోహన్‌రెడ్డి తెలిపారు.
Back to Top