కార్మికులకు కన్నీళ్లే మిగిలాయి

  • కార్మిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
  • ఈ నెల 21న విజయవాడలో కార్మిక సదస్సు
  • వైయస్‌ఆర్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి
విజయవాడ: రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన సాగుతుందని, కార్మికులకు కన్నీళ్లే మిగిలాయని వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు సర్కార్‌ అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ నెల 21న విజయవాడ నగరంలో మొట్టమొదటి సదస్సు ఏర్పాటు చేసినట్లు గౌతంరెడ్డి ప్రకటించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం కార్మిక సదస్సు పోస్టర్‌ను వైయస్‌ఆర్‌ టీయూసీ నాయకులతో కలిసి గౌతంరెడ్డి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ముందు చంద్రబాబు కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఏటా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి మూడేళ్లు అవుతున్నా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అబద్ధాలు చెప్పారని ఫైర్‌ అయ్యారు. బాబు అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు..ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల సర్కార్‌ దమనకాండను ప్రదర్శిస్తుందన్నారు. మూడు నెలలుగా కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ రోడ్డెక్కి పోరాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కార్మిక సంక్షేమాన్ని విస్మరించి భూదాహంతో చంద్రబాబు పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 2 వేల ఎకరాలు సరిపోతుందని నిపుణులు చెబుతున్నా..బాబు వినడం లేదని, లక్షన్నర ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తప్పుపట్టారు. కాంట్రాక్ట్‌ కార్మికులు చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవితాలు గడుపుతుంటే..టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు అబద్ధ ప్రచారం చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు, కార్మికులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని గౌతంరెడ్డి డిమాండ్‌ చేశారు.
 
Back to Top