కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లి

కారంపూడి,: కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్ క్షేమంగా ఉండాలని కోరుతూ పార్టీ మండల నాయకులు అంకాళ్ళమ్మ ఆలయం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంత్రాలమ్మ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న పీఆర్కే మంత్రాలమ్మ ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ పెద్దల అండతో టీడీపీ ఎంపీలు కుట్ర చేశారని ఆరోపించారు. ఇంత కక్ష సాధింపు చూస్తుంటే నిజంగా మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలు మట్టి కరవటం ఖాయమని, వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని చెప్పారు. రైతులు కరెంట్ కష్టాలు, పేదల, మధ్య తరగతి ప్రజలు ఛార్జీల భారంతో అల్లాడుతుంటే ఈ సమస్యలేమీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పట్టడం లేదని, కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా నిరోధించాలన్న దానిపైనే వారు దృష్టి సారిస్తున్నారని దుయ్యబట్టారు. దేవుడిపై తమకు పూర్తి నమ్మకముందని, ఎన్నో రోజులు జగన్‌ను కుట్రలు అడ్డుకోవని, త్వరలోనే బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ బాట అంటూ కాంగ్రెస్ పెద్దలు, మీ కోసం అంటూ చంద్రబాబు చేస్తున్న యాత్రలను ప్రజలు నమ్మరన్నారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవని, ఆ శక్తిని నీరొంధించి వీరు జనంలో ప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీపీ వెంకట నర్సయ్య, అక్బర్, వెన్నా నారపురెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పంగులూరి రామకృష్ణయ్య, మేకల శ్రీనివాస్‌రెడ్డి, చిలుకూరి చంద్రశేఖర్‌రెడ్డి, చింతల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Back to Top