కృష్ణా జిల్లాలో ప్రవేశించిన షర్మిల పాదయాత్ర

విజయవాడ, 26 మార్చి 2013:‌ మహానేత రాజన్న తనయ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు కృష్ణాజిల్లాలో ప్రవేశించింది. మొత్తం 31 రోజుల పాటు చేసిన శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారం సాయంత్రంతో పూర్తయింది. కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా నడుచుకుంటూ శ్రీమతి షర్మిల కృష్ణాజిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో శ్రీమతి షర్మిల 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

శ్రీమతి షర్మిలకు సాదర స్వాగతం చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. జగన్నినాదాలతో ప్రకాశం బ్యారేజ్‌ హోరెత్తింది. బ్యారేజ్‌ ఆ చివరి నుంచి ఈ చివరికి జనంతో కిక్కిరిసిపోయింది.

కాగా, శ్రీమతి షర్మిల ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడంతో నేటి నుంచి ఎనిమిదవ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతున్నది.

రాజన్న కుటుంబమే ఈ రాష్ట్రానికి దిక్కు అని మరో మారు రుజువైందని కొందరు అభిమానులు పేర్కొన్నారు. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యదీక్ష నిర్వహించారు. తదుపరి శ్రీమతి విజయమ్మ విద్యుత్‌ దీక్ష చేశారు. ఇప్పుడు రాజన్న తనయ తమ జిల్లాకు నడిచి వస్తుండడంతో తమ ఆడబిడ్డే వస్తుందన్న సంబరంగా కృష్ణా జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Back to Top