ఆ వాయిస్ నాది కాదని చెప్పగలవా..?

అమరావతి: 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' అని ఆడియో టేపుల్లో వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. అయితే సభలో అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. అధికారపక్షం మాత్రం సభను తప్పుదోవపట్టించేలా వ్యక్తిగత దూషణలకు దిగింది.

ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఓటుకు నోట్లు కేసులో ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను సభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబును తాము ముఖ్యమంత్రిగానే చూస్తున్నామని అన్నారు. ఆడియో టేపుల్లోని వాయిస్‌ నాది కాదు అని చెబితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం కాపాడటానికి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవారిపై పోరాటం చేస్తామని అన్నారు. ఆడియో టేపులోని వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్లే చేయాలని శ్రీధర్‌రెడ్డి అన్నారు.

Back to Top