కాల్ మనీ కేసులో ఎవర్నీ ఉపేక్షించొద్దు

హైదరాబాద్ : కృష్ణాజిల్లా టీడీపీ నేతలు పేదల రక్తపు కూడు తింటున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో కాల్మనీ వ్యవహారంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో కోడాలి నాని హైదరాబాద్లో స్పందించారు. కోడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసు దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకు లొంగ వద్దని ఆయన పోలీసులకు హితవు పలికారు. 

కాల్ మనీ కేసులో ఎంతటివారున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు ఎదుటి వారికి నీతులు చెబుతారు కానీ... ఆయన మాత్రం పాటించరని ఎద్దేవా చేశారు. కాల్ మనీ వ్యవహారం సొంత పార్టీ నేతల వ్యవహారం... దీనిపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో చూడాలని కొడాలి నాని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ టీడీపీ నాయకులను నిలదీశారు. 
Back to Top