కౌన్సెలింగ్ కేంద్రం వద్ద టెన్షన్‌ టెన్షన్

హైదరాబాద్‌, 30 ఆగస్టు 2012 : మాసబ్ ట్యాంక్లోని ఎంసె‌ట్ కౌన్సెలిం‌గ్‌ కేంద్రం వద్ద గురువారం రెండో రోజూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరుగుతున్న మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవనంలోకి చొచ్చుకుపోయేందుకు విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అక్కడే పెద్ద ఎత్తున మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి దూరంగా తరిమివేశారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ పూర్తిగా ‌చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇంజనీరింగ్‌ ఫీజుల విషయంలో స్పష్టత లేకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ విషయమై బుధవారం కూడా కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, తమ జీవితాలతో కిరణ్ సర్కా‌ర్ ఆడుకుంటోందని ఆరోపించారు. లక్షలాది ‌మంది విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యమంత్రికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. నేడు-రేపు అంటూ ఫీజు రీయింబర్సుమెంట్పై నా‌న్చివేత ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు.

కౌన్సెలింగ్‌ కేంద్రం వద్దకు అత్యధిక సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు తమకు పూర్తిగా ఫీజు రీయింబర్సుమెంట్‌ చేయాలని, తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని నినాదాలు చేశారు. అంతవరకూ కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Back to Top