'కరెంట్‌ స్విచ్‌ వేయాలంటే జనానికి చార్జీల షాక్'

కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా) : మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం‌ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానా‌లు అవలంబిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం కన్వీనర్‌ కొల్లి నిర్మల కుమారి దుమ్మెత్తిపోశారు. అందుకే ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ఆమె హెచ్చరించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఇచ్చిన పిలుపు మేరకు‌ బుధవారం కొత్తపేట విద్యుత్‌ ఉప కేంద్రం వద్ద జరిగిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.

ఏ వర్గం ప్రజలపైన కూడా ఆర్థిక భారం పడకుండా దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి చూశారని, ప్రస్తుత పాలకులు అన్ని రకాల పన్నులు, విద్యుత్, ఆర్టీసీ తదితర అన్ని చార్జీలు పెంచి మోయలేని భారాన్ని మోపార‌ని నిర్మల కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ స‌ర్‌చార్జీల పేరుతో సుమారు రూ.12 వేల కోట్ల భారం మోపడంతో ప్రజలు స్విచ్ వేయడాని‌కి కూడా భయపడుతున్నారన్నారు. పైగా ఇప్పుడు అది చాలదన్నట్టు రేపో మాపో మరో రూ.17 వేల కోట్ల భారం వేసి నిరుపేదలు, సామాన్యుల నడ్డి కూడా విరిచేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని ఆమె ధ్వజమెత్తారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధాన ప్రతిపక్షంగా ఎండగట్టి, నిలదీయాల్సిన తెలుగుదేశం అధికార కాంగ్రెస్ పార్టితో కుమ్మక్కయిందని‌ నిర్మల కుమారి ఆరోపించారు. తమ పక్షాన వైయస్‌ఆర్‌సిపి పోరాడుతున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ‌టిడిపిలకు బుద్ధి చెప్పేందుకు, తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top