కేంద్రంపై భాగస్వాముల 'ధరా'గ్రహం

యూపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనా!  గ్యాస్ సిలిండర్ల వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అధికారంమీద బండ పడినట్లే.!!
డీజిల్ ధర పెంపు.. గ్యాస్ సిలిండర్ల కేటాయింపులో కోత ప్రతిపక్షాలకు ఇంపుగా వినిపించలేదు. ఇప్పటికే సీపీఐ(ఎమ్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవడానికి తమకు ఒక్క క్షణం పట్టదని స్పష్టంచేసింది. 
యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ తీవ్రంగా స్పందించాయి. తత్ఫలితంగా  కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. డీజిల్ ధర తగ్గించాలనేది ఆ పక్షాల ప్రధాన డిమాండు. కేంద్రం చర్య ఆమ్ ఆద్మీ సిద్ధాంతానికి వ్యతిరేకమని అవి ఆరోపిస్తున్నాయి. 
డీజిల్ ధరను లీటరుకు 5 రూపాయలు పెంచడం ఒక ఎత్తయితే... గ్యాస్ సిలిండర్ల వినియోగం ఆరుకు మించితే రాయితీ ఎత్తేయాలన్న నిర్ణయం వాటికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.  ఢిల్లీ వాసులకు 399 రూపాయలకే సిలిండర్ లభిస్తుంది. పెట్రోలుపై పన్నును తగ్గించిన నిర్ణయం ఈ ఆగ్రహ జ్వాలను ఏమాత్రం చల్లార్చలేదు. 
వినియోగదారుడికి రాయితీ ధరకు ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తామనీ, మార్కెట్ ధరకు ఎన్ని సిలిండర్లయినా పొందవచ్చనీ కేంద్రం ప్రకటించడమే దీనికి కారణం. సామాన్యుడి సైతం చేరువైన గ్యాస్‌పై రాయితీని ఎత్తేయడం తగదని ప్రతిపక్షాలు సూచించాయి. శుక్రవారం నాడు కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. చంద్రబాబు సిలిండర్ను మోసి తన నిరసన తెలిపారు.
యూపీఏ రెండో అతిపెద్ద భాగస్వామి అయిన తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. తక్షణం దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.  పార్టీ అధినేత్రి మమత బెనర్జీ కేంద్ర వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో భాగస్వామి కావడం కంటే బయటకు రావడం మేలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపడతారని ఆమె ప్రకటించారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తానని ఆమె హెచ్చరించారు. నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  కేంద్ర నిర్ణయంపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీతో దీనిగురించి చర్చించనే లేదన్నారు. తాము చేపట్టబోయే ర్యాలీలో పాలుపంచుకోవాల్సిందిగా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 
యూపీఏ మరో భాగస్వామి అయిన డీఎమ్‌కే కూడా ఇంధన ధరల పెంపును ఖండించింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, ఈ దశలో తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు శరాఘాతమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ కోరారు.  సమాజ్‌వాదీ పార్టీ కూడా కేంద్రం చర్యను తప్పు పట్టింది. 
ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ  ప్రకటించింది. సిలిండర్లపై పరిమితిని తప్పు పట్టింది.  బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతో లేచిన మంటల్లో కేంద్రం డీజిల్ పోసిందని ఆ పార్టీ ప్రతినిధి అనంతకుమార్ వ్యాఖ్యానించారు.  పేదలకు, రైతులకు ఈ చర్య వ్యతిరేకమని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం కేంద్రం చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి.
మరోవంక, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంఘీభావాన్ని ప్రకటించింది.  మంచి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. 
Back to Top