కడప డిసిసిబి వద్ద పార్టీ ఎమ్మెల్యేల ధర్నా

కడప, 20 ఫిబ్రవరి 2013: సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అకృత్యాలు పరాకాష్టకు చేరాయి. వైయస్‌ఆర్ జిల్లా ‌డిసిసిబి ఎన్నికల అధికారిని‌ గత రాత్రి కిడ్నాప్ చేయడం ద్వారి పరిస్థితి ఉద్రిక్తంగా మార్చివేసింది. ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి చంద్రశేఖర్ రాత్రి నుంచి కనిపించటం లేదు. అధికారి కనిపించడంలేదన్న సాకుతో కడప డిసిసిబి ఎన్నికను వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తోందని వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. డిసిసిబి ఎన్నికను తక్షణమే నిర్వహించాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ నాయకుడు వైయస్‌ వివేకానందరెడ్డి, జిల్లా పార్టీ‌ కన్వీనర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, తదితరులు ధర్నాకు దిగారు. కడప డిసిసిబి ఎన్నికను నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించకపోతే ఆమరణదీక్షకు, అవసరమైతే ప్రాణత్యాగానికైనా తాను సిద్ధం అని వివేకానందరెడ్డి హెచ్చరించారు. దీనితో కడప డిసిసిబి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

కాగా, డిసిసిబి ఎన్నికల అధికారి ‌చంద్రశేఖర్‌ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌ పార్టీ వారే కిడ్నాప్‌ చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారి అదృశ్యంపై ఆయన భార్య, వైయస్‌ఆర్‌సిపి నాయకులు ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వేరువేరుగా ఫిర్యాదులు చేశారు.

‌కడప డిసిసిబిలో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ లేకపోయినా ఎన్నికల అధికారిని కిడ్నాప్ చేసి ఈ ఎన్నికను ఏదో విధంగా వాయిదా వేయించాలని నిస్సిగ్గుగా చూస్తోందని రాయచోటి వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేసిందంటూ పార్టీ నాయకుడు వైయస్‌ వివేకానందరెడ్డి నిప్పులు చెరిగారు. డిసిసిబి ఎన్నికకు కోరంలేదని సాకు చూపించి నిన్న వాయిదా వేసిన అధికార యంత్రాంగం ఈ రోజు కోరం ఉన్నా ఎన్నికల అధికారి లేడని చెబుతూ ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పక్షపాత వైఖరికి ఈ సంఘటన నిదర్శనం అన్నారు. సాకు చూపించి ఎన్నిక వాయిదా వేయడం దురదృష్టకరం అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కడప డిసిసిబి ఎన్నిక నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కడప డిసిసిబి ఎన్నికపై ఇంత రాద్దాంతం చేయడం కాంగ్రెస్‌ పార్టీ నీతిమాలిన చర్య అని రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు.

డిసిసిబి ఎన్నికపై తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు తెలిపారు. ఎన్నికల ప్రక్రియనే కాంగ్రెస్‌ వారు అపహాస్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసిసిబి ఎన్నిక వాయిదా వేయడంపై రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

డిసిసిబి ఎన్నిక కోసం కార్యాలయానికి ఉదయాన్నే కాంగ్రెస్, వై‌యస్ కాంగ్రె‌స్ మద్దతుదారులు చేరుకున్నారు. అధికారి అదృశ్యం నేపథ్యంలో‌ పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Back to Top