కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం

హైదరాబాద్, 13 మే 2013:

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డిపై వైయస్ఆర్ కాంగ్రెస్ అభిమాన ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. తామేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు ఆయన మాట్లాడుతున్నారనీ, తమకు నిబంధనలు తెలియవనీ, రాజ్యాంగం పట్ల, రాజకీయాల పట్ల అవగాహన లేదన్నారని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడదని అంటూనే ఉప ఎన్నికలకోసం తాము ఎదురుచూస్తున్నామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తాము అసెంబ్లీ స్పీకరుకు లేఖ రాశామన్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్ర వారివురు మీడియాతో మాట్లాడారు. గండ్రకు తెలుగు చదవడం కూడా ఇబ్బందిగా ఉన్నట్టుందని విమర్శించారు. శాసనసభాపతికి ఇచ్చిన లేఖలో విప్ ధిక్కరానికి సంబంధించి తాము స్పష్టంగా తెలియజేశామన్నారు. 2009 తర్వాత 52 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండే గెలిచిన  విషయాన్ని గండ్ర గుర్తుచేసుకోవాలన్నారు. ఆ రెండూ కూడా టీడీపీ మద్దతుతోనే గెలిచిన విషయం మరచిపోవద్దన్నారు. పరకాల ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ అయినా వచ్చిందన్నారు. తమని విమర్శించే ముందు ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు.

హామీలను తీర్చని కాంగ్రెస్‌పై అనర్హత
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఐదేళ్లలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండా అనర్హత ప్రకటించాలని రాష్ట్రపతిని, ప్రధాన ఎన్నికల అధికారిని కోరుతూ లేఖ రాస్తామని వారు వెల్లడించారు. హామీలను అమలుచేయకుండా 8 కోట్ల మంది ప్రజలను వంచించిందని లేఖలో వివరిస్తామన్నారు.  దమ్ము, ధైర్యం ఉంటే తమని అనర్హులుగా చేసి ఉపఎన్నికలు నిర్వహించమని సవాలు చేశారు. ఆ ఎన్నికలలో ఎవరి సత్తా ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తాము మాజీలవడానికే సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.  కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేసే ఏ కుటిల ఎత్తుగడనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తప్పించడానికి మార్చి నెలలో చిన్నచిన్న పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామని నాని, రవికుమార్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ అంశంలో తన బాధ్యతనుంచి తప్పుకుందని ఎద్దేవా చేశారు.  విప్‌ను ధిక్కరించామని ఏప్రిల్ నెలలోనే స్పీకరును కలిసి చెప్పామన్నారు. తమను అనర్హులను చేసి ఉప ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని కూడా విజ్ఞప్తిచేశామన్నారు. సోమవారం కూడా స్పీకరుకు ఒక లేఖ పంపామన్నారు. ఎలక్షన్ కోడ్ సెక్షన్ 151 ప్రకారం తమని అనర్హులుగా ప్రకటించాలని కోరామన్నారు.  సబ్ క్లాజ్ ఎ ప్రకారం ఈ చర్య తీసుకోవాలని అడిగామన్నారు. ఇది ఎవరి పరిధిలోకి వస్తుందో.. రాదో తెలీకుండా లేఖ రాయలేదన్నారు.

ప్రజల పక్షాన నిలిచేందుకే అవిశ్వాసానికి మద్దతు
గడిచిన అసెంబ్లీ సమావేశాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందనీ, ప్రజలకు అండగా నిలవడం కోసమని ఆ పార్టీ పక్షాన తీర్మానానికి అనుకూలంగా ఓటేశామని వారు వివరించారు. 2009లో ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రణాళికలో హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. రైతులకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, 30 కిలోల బియ్యం సరఫరా తదితర అంశాలను తుంగలో తొక్కిందన్నారు.  హామీలను మరవడమే కాక, కొత్త కొత్త పన్నులను వేస్తూ ప్రజా కంటకంగా మారిందన్నారు. చంద్రబాబు అండ ఉన్నందున 2014 వరకూ కూడా తమను ఎవరూ ఏమీ చేయలేదరనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో పోటీచేయకుండా నిలువరించాలని రాష్ట్రపతినీ, ప్రధాన ఎన్నికల అధికారినీ కోరతామన్నారు. హామీలను నెరవేర్చని వైనంపై గండ్ర వెంకట రమణారెడ్డి సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.

కావాలనే కాలయాపన తంత్రం
జూన్ తర్వాత తమను అనర్హులను చేస్తే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముండదని భావిస్తూ కాలయాపన చేయడమనే తంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తోందని గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. తాము విప్ ధిక్కరించామనడానికి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలవడమే సాక్ష్యమనీ, ఇంకా వేరే సాక్ష్యం ఏం కావాలనీ ఆయన ప్రశ్నించారు. దీన్నిబట్టే తమపై చర్య తీసుకోవచ్చారు. తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని గొట్టిపాటి ప్రకటించారు.

తాజా వీడియోలు

Back to Top