కాంగ్రెస్‌ ద్వంద్వనీతిపై అంబటి ధ్వజం

గుంటూరు, 10 సెప్టెంబర్‌ 2012: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పాదయాత్ర సందర్బంగా ఎలాంటి డైరీ రాయలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. 2003లో వైయస్‌ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ 1600 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా ఆయన వివిధ వర్గాలు, రైతుల సమస్యలను అతి సమీపంగా చూసి, వారి నుంచే తెలుసుకున్నారు. ఆ సందర్భంగా వైయస్‌ డైరీ రాసినట్లు ఆయనతో పాటు పదం కలిపి పాదయాత్ర చేసి, అత్యంత సన్నిహితంగా మెలగిన నాయకులకు కూడా తెలియదని పార్టీ స్పష్టం చేసింది. అసలు అలాంటి డైరీ ఒకటి ఉందన్న విషయం కూడా ఎవరి దృష్టికీ రాలేదని పేర్కొంది.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా రాసిన డైరీ అని పేరు చెప్పి ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు కొందరు ఢిల్లీలో ఆడంబరంగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గుంటూరులో పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ప్రభుత్వం మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ కాంగ్రెస్‌ అవకావ వాదానికి ప్రతీకలని ఆయన దుయ్యబట్టారు.‌

తాను, మరికొందరు నాయకులు వైయస్‌తో పాటు పాదయాత్రలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నామన్నారు. అయితే, ఆ సమయంలో వైయస్̤ డైరీ రాసి దాఖలా ఉన్నట్లు తమలో ఎవరికీ తెలియదని చెప్పారు. వైయస్‌కు సన్నిహితంగా ఉన్న తమ ఎవరికీ తెలియని డైరీ ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకు ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చిందో అని ఆయన ఎద్దేవా చేశారు. డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొని వైయస్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఈ సీనియర్‌ నాయకుల నోళ్ళు ఆయన పేరును చార్జిషీట్‌లో చేర్చినప్పుడు ఎందుకు మూగబోయాయని అంబటి నిలదీశారు. ఒక వైపున మహానేత వైయస్‌ను, ఆయన విధానాలను తన సొంతం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తున్నదని అంబటి ఆక్షేపించారు. అదే సమయంలో వివాదాస్పద 26 జీఓలకు తాను దూరమని చెప్పుకుంటూనే మరో పక్కన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై బురద చల్లాలని ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఆటలు సాగబోవని అంబటి హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాటకాలను ప్రజలు నమ్మబోరని, వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే వారు తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top