జెపి దర్గా నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

షాద్‌నగర్‌ (పాలమూరు జిల్లా), 10 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం 54 వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. పాలమూరు జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని జహంగీర్‌ పీర్‌ దర్గా (జెపి దర్గా) నుంచి ఆమె పాదయాత్రను సోమవారం ఉదయం ప్రారంభించారు. జెపి దర్గాలో శ్రీమతి షర్మిల చాదర్‌ సమర్పించి పాదయాత్ర ప్రారంభించారు. దర్గాలో శ్రీమతి షర్మిల ప్రార్థనలు చేశారు. షర్మిల పాదయాత్రలో పార్టీ శ్రేణులు, నాయకులు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో శ్రీమతి షర్మిలకు సాదరంగా స్వాగతం పలికారు.

జెపి దర్గా నుంచి శ్రీమతి షర్మిల ఇన్ముల్‌నర్వ, మేకగూడ గేట్‌ మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం కొత్తూరు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. తర్వాత కొత్తూరు తండా చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

చరిత్రలో మరే మహిళా ఇప్పటివరకూ సాహసించని రీతిలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల శనివారం రాత్రికి జెపి దర్గా వద్దకు చేరుకున్నారు. ఆదివారంనాడు ఆమె పాదయాత్రకు నిర్వాహకులు విరామం ప్రకటించారు. ఈ సందర్భంగా షర్మిలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిని అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడి శైలికి నిరసనగా శ్రీమతి షర్మిల తన అన్న జగనన్న తరఫున ఈ సాహసోపేతమైన పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
Back to Top